Close

ప్రజా సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టండి,అర్జీల పరిష్కారం వేగవంతం చేయండి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 22/12/2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 265 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి జాప్యం లేకుండా పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్‌ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రజల నుండి వృద్ధాప్య , ఒంటరి మహిళ, వికలాంగ పెన్షన్లు మంజూరు చేయాలని, వృద్ధాప్యంలో ఉన్న వారిని పిల్లలు చూడటం లేదని, రేషన్ కార్డులు కొరకు, డ్రైనేజీ, సరిహద్దు సమస్యలు ఆక్రమణలు, తదితర అంశాలపై రెవిన్యూ, డి ఆర్ డి ఏ, సర్వే, పంచాయతీరాజ్, ఆరోగ్య, పౌరసరఫరాలు, తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను అర్జీ దారుల నుండి స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగవంతంగా పరిష్కారం చేయాలన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలనుండి 265 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. స్వీకరించిన ప్రతీ అర్జీకి అర్థవంతమైన సమాదానం ఇస్తూ పరిష్కరించాలని సూచించారు. ప్రతీ అర్జీని ఆడిట్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్జీదారుడుకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని అన్నారు. అర్జీలు రీ-ఓపెన్ అయితే వాటికి గల కారణాలను పిటీషనర్ కు వివరించాల్సి ఉంటుందన్నారు.
వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈరోజు అర్జీదారులు నుండి స్వీకరించిన కొన్ని ఫిర్యాదులు ఈ విధముగా ఉన్నవి

1) వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామం నుండి గుత్తుల ఆంజనేయులు.. గ్రామంలోని మంచినీటి చెరువులోకి బల్ల సత్యనారాయణ, బల్ల భాస్కరరావులకు చెందిన డ్రైన్ నీరు వదులుతున్నారు. పంచాయితీకి ఫిర్యాదు చేయగా ఎటువంటి చర్యలు తీసుకోవటము లేదు. వెంటనే చర్యలు తీసుకుని మంచినీటి చెరువు కలుషితం కాకుండా కాపాడాలని కోరారు.

2) పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరము గ్రామం, గోల్తి కనక మహాలక్ష్మి .. వృద్ధాప్యంలో ఉన్న తనను తన కోడలు గోల్తి మహాలక్ష్మి, తాను స్వార్జితంగా సంపాదించుకున్న ఇంటిలో నుండి బయటకు గెంటివేసింది చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

3) పాలకోడేరు మండలం పెన్నాడ పాలెం కొత్తపేట.. ఆరేపల్లి నాగ గణేష్ 27 సంవత్సరములు మూగ, చేముడుతో బాధపడుతున్నాను. తండ్రి చనిపోయారు. తల్లి ఆదరణతో జీవిస్తున్న పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

4) అత్తిలి మండలం గూడూరు గ్రామం తలారి గంగయ్య, వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరారు.

5) ఆకివీడు పెద్దపేట పూని రాజామణి 67 సంవత్సరాలు అనారోగ్యముతో బాధపడుతున్నాను వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

6) కాళ్ల మండలం ఏలూరుపాడు తాడి వెంకటకృష్ణ రావు.. 80 శాతం వినికిడి లోపం, కళ్ళు కూడా సరిగా కనిపించవు, ఏ పని చేయలేక పోవుచున్నాను. పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వృద్ధుల సంక్షేమ అప్పీల్లేట్ ట్రిబ్యునల్ మెంబెర్ మేళం దుర్గాప్రసాద్, పలు శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.