ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి నాణ్యమైన పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు మరింత సమర్ధవంతంగా పని చేయాలి.
కాలువ గట్లు, రోడ్డు మార్జిన్లు అక్రమించుకొని గుళ్ళు, విగ్రహాలు ఏర్పాటను రెవిన్యూ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు.
భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని రెవిన్యూ అధికారులతో పీజీ ఆర్ఎస్, 22 ఏ, ఐ వి ఆర్ ఎస్, రీ సర్వే, కోర్టు కేసులు, ముటేషన్, ఇళ్ల నిర్మాణం, తదితర రెవెన్యూ అంశాలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రెవిన్యూ అధికారులు మరింత సమర్థవంతంగా, పారదర్శకతతో పనిచేయాలన్నారు. పి జి ఆర్ ఎస్, 22 ఎ కేసుల పరిష్కారానికి తహసిల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సంబంధిత కేసుల పరిష్కారంపై ఆర్డీవోలు పర్యవేక్షించాలన్నారు. పీజీఆర్ఎస్ లో అందే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిజిఆర్ఎస్ లో అందిన పిర్యాదుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి, అర్జీదారు సంతృప్తి పడే విధంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. పిర్యాదు అందగానే అది మన పరిధిలో ఉందా లేదా పై స్ధాయిలో ఉందా అని అవగాహన చేసుకొని సదరు పిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేయాలన్నారు. భూ సమస్యలపై అధికంగా వస్తున్న ధరఖాస్తులపై ప్రత్యేక దృషిపెట్టాలని, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులోపుగా వాటిని పరిష్కరించాలని సూచించారు. జనవరి నెల నుండి ప్రతివారం మండలాలలో పర్యటించి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తానని, కావున సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాలువ గట్లు, రోడ్డు మార్జిన్లు ఆక్రమించుకొని గుళ్ళు, విగ్రహాలు ఏర్పాటు చేసే వారికి ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ఐ వి ఆర్ ఎస్ కాల్స్ తెలుసుకునే ప్రజల స్పందన సంతృప్తికరంగా ఉండేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు ఐదు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసి పంపిణీ విధానాన్ని, నాణ్యతను పరిశీలించాలన్నారు. ట్రక్ షీట్ జనరేట్ తర్వాత మిల్లులకు దాన్యం సకాలంలో చేరడం లేదని ఈ విషయమై మిల్లులను సందర్శించి లోటుపాట్లను సరిచేయాలన్నారు. రీ సర్వే కు సంబంధించి థర్డ్ ఫేజ్ 22 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూత్లింగ్ పూర్తయింది అన్నారు. సచివాలయంలో కొంతమంది డిజిటల్ అసిస్టెంట్లు ప్రజల నుండి వచ్చే దరఖాస్తులకు పంచాయతీ సెక్రెటరీ సంతకం కావాలనే సాకుగా తిరస్కరించడం జరుగుచున్నదని, ఏ దరఖాస్తు వచ్చిన తీసుకోవాల్సిందేనని, తిరస్కరిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.
సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్ సరోజ, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.