ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
సోమవారం స్థానిక కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీదారుడు సంతృప్తిచెందేలా సమస్యలను వేగంగా పరిష్కరించినపుడే ప్రభుత్వ అధికారులపై ప్రజలకు విశ్వాసం కలుగుతుందని, దీనితోపాటు వారి మన్ననలు పొందవచ్చన్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 182 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది
వాటిలో కొన్ని అర్జీలు ఈ విధంగా ఉన్నాయి.
1) ఇందుర్తి దుర్గ భవాని పోడూరు మండలం పండితవల్లూరు గ్రామం. తన భర్త చిన్న వయసులో యాక్సిడెంట్లో చనిపోయారని, తనకు 7, 9 సంవత్సరముల ఇద్దరు పిల్లలు తో కూలి పని చేసుకుంటూ జీవించుచున్నాని తెలిపారు. తన భర్త చనిపోయిన తరువాత ప్రభుత్వం నుండి ఎటువంటి బీమా సహకారం అందలేదు అని ఇంటర్మీడియట్ చదువుకున్నాను, దయచేసి ఉద్యోగము గాని , ప్రభుత్వ ఆర్థిక సహాయం గాని అందించాలని ఫిర్యాదులో కోరారు.
2) శరకణం పార్వతి అత్తిలి మండలం లక్ష్మీనారాయణ పురం నుండి, ఐదు నెలలుగా ప్రభుత్వ రేషన్ బియ్యం రావడం లేదు కారణం తెలియదు తహాసిల్దార్ కార్యాలయంకు వెళ్ళగా టైం పడుతుంది అంటున్నారు. రేషన్ బియ్యం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
3) పాలపర్తి మార్కు రాజు, భీమవరం మండలం మెంటేవారి తోట, నెల రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు విద్యుత్, మున్సిపల్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదు వీధీ దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
4) ఉండ్రాజవరపు చల్లారావు వీరవాసరం మండలం కొనిణితవాడ గ్రామం, వీరవాసరం మండలం నవుడూరు గ్రామం సెంటర్ కు నిత్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలుతో రద్దీగా ఉంటుంది, రోడ్డుకి ఇరుపక్కల ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు గురి అవుతున్నారు. ఆక్రమణలు తొలగించే చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు.
5) మార్లపూడి చాoటియ్య, తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి నుండి వృద్ధుడును అని కూడా చూడకుండా తన కుమారుడు తనపై దౌర్జన్యం చేసి నివాసముంటున్న ఇల్లు తన దగ్గర ఉన్న కొంత నగదును కాజేసి చిత్రహింసలు పెడుతున్నాడు దయచేసి చర్యలు తీసుకోని తన కుమారుడు బారి నుండి కాపాడాలని కోరారు.
6) గుత్తుల సత్యవతి గణపవరం మండలం వెంకట్రాజపురం గ్రామం తనకు ఉన్న నాలుగు సెంట్లు భూమిని సరిహద్దులు వారు పూర్తిగా ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం సర్వే చేయించి తన భూమి ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
7) చదలవాడ శేఖర్ బాబు, తణుకు మండలం ముద్దాపురం గ్రామం 90 శాతం వికలాంగత్వం సర్టిఫికెట్ ఉన్నప్పటిక వికలాంగ పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోగా సచివాలయంలో ఎటువంటి సమాధానము చెప్పడం లేదు దయచేసి వికలాంగ పెన్షన్ ఇప్పించగలరు అని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.