ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆచంట నియోజకవర్గంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం విజయవంతం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి
ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ
ఆచంట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు విడతలుగా నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం మార్టేరు శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో నిర్వహించిన నాలుగో విడత నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని అధికారులు సానుకూల దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారం సాధ్యం కాని అంశాలపై సంబంధిత అర్జీదారులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆచంట నియోజకవర్గంలో నాలుగు వారాలుగా వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నేడు నిర్వహించిన నాలుగో విడత పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. వాటిలో ఆచంట మండలం నుండి 53, పెనుమంట్ర మండలం నుండి 86, పొడూరు మండలం నుండి 8, పెనుగొండ మండలం నుండి 78 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులలో ఇళ్ల స్థలాలు, వితంతు మరియు వికలాంగ పింఛన్లు, ఉపాధి అవకాశాలు, రుణాల మంజూరు, భూ సమస్యలు వంటి అంశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఒక నెలలో నాలుగు వారాల పాటు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. ప్రజల నుండి ప్రధానంగా పింఛన్లు, భూ సమస్యలు, ఇండ్ల పట్టాలు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వచ్చాయని, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, ముఖ్యంగా పింఛన్ల పంపిణీలో పారదర్శకత పాటిస్తున్నదని తెలిపారు. రైతులకు ఎటువంటి తప్పులు లేని రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీతనంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారని తెలిపారు. అధికారులు సేవాభావంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పీజీఆర్ఎస్‌లో ప్రజల నుండి వచ్చిన కొన్ని అర్జీలు ఇలా
* పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన కొవ్వూరు సత్యవతి తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
* పెనుగొండ మండలం నెగ్గిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.
* పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామానికి చెందిన జి. నాగేశ్వరరావు సోలార్ కనెక్షన్ మంజూరు చేయాలని కోరారు.
* పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన దాసరి రామారావు తన భూమి రికార్డుల్లో తేడాలు ఉన్నాయని, రీ సర్వే చేసి అడంగల్‌లో 43 సెంట్లు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
* పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన శీలం లక్ష్మి ఝాన్సీ తాను వికలాంగురాలినని, వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
* పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన నల్లిమిరి భవాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిలా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్‌డీవో దాసిరాజు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, ఆచంట నియోజకవర్గం ప్రత్యేక అధికారి మరియు జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, డ్వామా పీడీ డాక్టర్ కె.సి.హెచ్.అప్పారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి, సీపీఓ కె.శివపార్వతి, డీఎస్ఓ ఎన్.సరోజ, జిల్లా కార్మికశాఖ అధికారి ఏ.లక్ష్మి, ఐసీడీఎస్ పీడీ డి.లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.అరుణకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.