ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులను ప్రోత్సహించండి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రసాయనరహిత వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించండి.
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశు వైద్య శాఖ, డిఆర్డిఏ శాఖలతో జిల్లా స్థాయి కాన్సెర్వెన్సీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రసాయనక ఎరువులు, పురుగుమందుల వినియోగించకుండా, జీవసంబంధమైన పదార్థాలను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నడుస్తోందన్నారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ క్రింద కొత్తగా 140 గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ సాగుకు సంబంధిత శాఖల సమన్వయంతో ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన పెంచేందుకు గ్రామస్థాయిలో విస్తృతంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఎస్ హెచ్ జి మహిళలకు శిక్షణ ఇచ్చి ఒక్కొక్క మహిళను ఒక్కొక్క గ్రామానికి కేటాయించి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా పండించిన ఉత్పత్తులను ప్రతిరోజు గుర్తించిన ప్రాంతాలలో అమ్మకాలు జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నాచురల్ ఫార్ మింగ్ ఉత్పత్తులకు రైతులకు అదనపు ధరతో గిట్టుబాటు అయ్యేలా చూడాలన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అమలు అవుతున్న విధానం, ఇప్పటివరకు అమలులో ఉన్న గ్రామాలు, అలాగే తాజాగా గుర్తించిన 140 కొత్త క్లస్టర్ల వివరాలను సమగ్రంగా వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేస్తున్న నవధాన్యాల ప్రోత్సాహం, కాషాయాలు , ద్రావణాలు, బయో కల్చర్, కోడిగుడ్డు-నిమ్మరసం వినియోగం కిచెన్ గార్డెన్ల స్థాపన, ఇప్పటి వరకు నిర్వహించిన డ్రోన్ స్ప్రేయింగ్ కార్యక్రమం గురించి పి.పి.టి ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వై.నూకరాజు, జిల్లావ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ పి.డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సెర్ప్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.