ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ప్రకృతి వైపరీత్యాలు, అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవించినప్పుడు తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ తోటి వారిని ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా స్పందించాలో రాష్ట్ర విపత్తుల సహాయబలం (ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్) బృందం నిర్వహించిన సామాజిక అవగాహన కార్యక్రమం విద్యార్థులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఎపి ఎండిఆర్ఎఫ్ బృందం జిల్లా అధికారులు, ప్రజలు, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, తుపాను, వరదల సమయంలో ప్రజలు ఏవిధంగా స్పందించాలి, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివిధ అంశాలపై ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారన్నారు. వరదల సమయంలో ఏ విధంగా బయటపడాలి, గాయాలు తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అపస్మారక పరిస్థితుల్లో ఉన్న వారికీ ఏ విధంగా సిపిఆర్ చేయాలి, క్షతగాత్రులను ఏ విధంగా ఆసుపత్రులకు తరలించాలి, గ్యాస్ లీకేజీ సమయంలో మంటలను ఏ విధంగా అరికట్టాలి, పాము కాటుకు గురైన వారికి ప్రధమ చికిత్స ఏ విధంగా చేయాలి అంశాలపై తమ ఇంటిలో లేదా తమ సమీపంలో ఉన్న వస్తువులను ఉపయోగిస్తూ ఏ విధంగా బయటపడాలో కళ్ళకు కట్టినట్టుగా చూపుతూ అవగాహన కల్పించారన్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్ అవగాహన కార్యక్రమంలో తెలుసుకున్న విషయాల్లో సిపిఆర్ చేసే విధానాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా డెమో చేసి చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈరోజు నేర్చుకున్న నైపుణ్యాన్ని విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు తెలియజేయాలన్నారు. జిల్లా అధికారులు తమ పరిధిలోని డివిజనల్, మండల స్థాయి అధికారులకు సంబంధిత అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
తొలుత ఎన్ డి ఆర్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు డెమో ప్రదర్శనను విపులంగా అవగాహన కల్పించగా, జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, అధికారులు, ప్రజలు, విద్యార్థులు ఆద్యంతం తిలకించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డిఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, ఎల్ డి ఎం నాగేంద్ర ప్రసాద్, జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయ రాజు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్ వి అరుణ కుమారి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్ప రాణి, ఇంచార్జ్ ఆర్ అండ్ బి ఎస్సీ శ్రీనివాస్ రావు, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, జిల్లా హ్యాండ్లూమ్ అధికారి అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎన్ డి ఆర్ ఎఫ్ ఇన్స్పెక్టర్ అరుణోదయ దివేది, హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు, కానిస్టేబుల్ కే.శ్రీనివాసరావు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం సభ్యులు వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
