Close

పేరుపాలెం బీచ్ పర్యాటకులకు, మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 18/12/2024

బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా మెరైన్, మత్స్యశాఖ అధికారులతో పేరుపాలెం బీచ్ పర్యాటకుల భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ బీచ్ లో స్నానాలు చేసే వారి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈతగాళ్ళు ఏర్పాటు, బోట్లతో పహరా, ప్రమాద హెచ్చరిక బోర్డులు, తదితర చర్యలను తీసుకోవాలన్నారు. ఇస్రో రూపొందించిన పరికరాలను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40 – 60 శాతం సబ్సిడీతో అందజేయడం జరుగుతుందని, సముద్రంలో వేటకు వెళ్లే ఫిషింగ్ బోట్లకు ట్రాస్పాండర్స్ పరికరాలను బిగించుకోవడం వలన తుఫాను సమయాల్లో బోట్లు ఏ ప్రాంతంలో ఉన్నది సులువుగా తెలుసుకోవచ్చన్నారు. ఈ విషయంపై మత్స్యకారుల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

అంతర్వేది మెరైన్ పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏఎన్ఎం మూర్తి సముద్ర పర్యాటకుల ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై ప్రతిపాదనలను సభలో వివరించారు. మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎల్ ఎల్ ఎన్ రాజు మత్స్య రంగం బలోపేతానికి అమలు చేస్తున్న పథకాలను వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, కోస్టల్ స్ట్రెచ్ మెరైన్ అడిషనల్ ఎస్పీ జిబిఆర్ మధుసూదన రావు, అంతర్వేది మెరైన్ పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏఎన్ఎం మూర్తి, మత్స్య శాఖ ఏడి ఎల్ ఎల్ ఎన్ రాజు, కాకినాడ కోస్టల్ గార్డ్ ఎస్.పి గుప్తా, ఐబి డి సి ఐ ఓ సందీప్ సుదర్శన్, మెరైన్ ఎస్ఐ నాగార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.