Close

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీలేదు-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 25/07/2025

నిధులు కొరత లేదు.. నూరు శాతం మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నాం..

శుక్రవారం ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి ఆసుపత్రి మౌలిక వసతుల విస్తరణ పై సంబంధిత వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేదలు అనారోగ్యం పాలైతే ప్రైవేట్ హాస్పటల్ ను ఆశ్రయించి ఆర్థికంగా మరింత పేదలుగా మారుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రైవేటు హాస్పిటల్స్ కు దీటుగా అన్ని వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా ఏదైనా అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదనలను పంపాలని సూచించారు. ఈ సందర్భంలో ఓపి పెరిగినందుకు వైద్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇప్పటికే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నామని, ఈరోజు ఎక్సరే సెంటర్ ను, నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఆసుపత్రి వాతావరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంతోపాటు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని సూచించారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఈ హాస్పిటల్ డయాలసిస్ కేంద్రానికి ఆరోగ్యశ్రీ అనుసంధానానికి అనుమతులకు ప్రయత్నిస్తున్నారని, రానున్న కొద్ది రోజుల్లో అనుమతులు మంజూరు అవుతాయని, ఈ లోపుగా అవసరమైన కొత్త వార్డును, సౌకర్యాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ కి సంబంధించి ఏ అవసరం ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఈ సమావేశంలో డిసిహెచ్ఎస్ పి.సూర్యనారాయణ, హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి.భువన, హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ బిలాల్, హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ సిహెచ్.ఆదిలక్ష్మి, డాక్టర్ గణేష్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.