Close

పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో కూడా అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కేటాయించిన 25% సీట్లుకు నూరు శాతం అడ్మిషన్లు ఇవ్వాల్సిందే..

Publish Date : 19/06/2025

అడ్మిషన్లు తీసుకొని ప్రవేటు పాఠశాలలపై చర్యలు తప్పవు…

ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు భర్తీపై వెంటనే నివేదికను అందజేయాలి..

అధిక ఫీజులు వసూలు, పాఠశాలలో పుస్తకాలు, విద్యా మెటీరియల్ అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు..

ప్రభుత్వం సూచించిన సమయాల్లోనే పాఠశాలలను తప్పక నిర్వహించాలి, అదనపు సమయం నిర్వహిస్తే చర్యలు ఉంటాయి

ప్రభుత్వ పాఠశాలలకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ప్రైవేటు పాఠశాలలకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి ఇందులో ఏ విధమైన వ్యత్యాసం లేదు..

ఎంఈఓలు, డివైఈవోలు, డిఇఓ విరివిగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలి

.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పేద, మధ్య తరగతి వర్గాలు ప్రయివేటు పాఠశాలల్లో చదువులు మోయలేని భారం అయినా కోటి ఆశలతో మొగ్గు చూపుతున్నారని, ఫీజులు భారమే కాకుండా, విద్యా సామాగ్రి కొనుగోలు పేరిట వసూళ్లు మరింత భారాన్ని మోపుతున్నాయని జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

గురువారం భీమవరం విష్ణు కాలేజీ సమావేశ మందిరం నందు జిల్లా విద్య శాఖ అద్వర్యంలో ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హాజరై, మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వారి పిల్లలు భవిష్యత్తును గొప్పగా ఊహించుకొని ఫీజులు భారమైన ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, దీనికి తోడు పుస్తకాలు, విద్యాసామగ్రి, కల్చరల్ యాక్టివిటీస్, ఎక్స్ ట్రా కర్క్యులర్ ఆక్టివిటీస్ పేరిట వసూలు చేస్తున్నారన్నారు. అధిక ఫీజులు వసూలు, విద్య సామగ్రి అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. విద్యార్థులకు బట్టి చదువులు కాకుండా, విస్తృత పరిజ్ఞానాన్ని అందించేలా చదువులు ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు స్వయంగా పరిష్కరించుకునే అంత పరిజ్ఞానం నేర్పించాలన్నారు. నేడు సమావేశానికి హాజరైన వారు సమావేశంలో తెలియజేసిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటించాలన్నారు. కొన్ని పాఠశాలలు సీబీఎస్ఈ, ఐసిఎస్ఇ సిలబస్ అని చెప్పుకుంటున్నాయని, ఏ సిలబస్ అయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాల్సిందేనన్నారు. అధిక ఫీజులు వసూలుపై ఎంఈఓలు, డిప్యూటీ డిఇఓలు, డీఈవో ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లను మాత్రమే నియమించాలని, పాఠశాల వేళలను రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు కచ్చితంగా పాటించాలన్నారు. పేద కుటుంబాల పిల్లలకు 12-1 (సి) నిబంధనలకు లోబడి ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు తప్పకుండా కేటాయించాలని, ఇప్పటివరకు పాఠశాలల వారీగా 25 శాతం సీట్లు భర్తీ వివరాలను వెంటనే అందజేయాలని డీఈఓను ఆదేశించారు. పేద ప్రజలకు 25 శాతం సీట్లు నిజంగా అమలు జరుగుతుందా, కాగితాలకే పరిమితం అవుతుందా అని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఖచ్చితంగా అమలు చేయకపోతే చర్యలు తప్పవని పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను చేపట్టేందుకు ఆదేశించడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్క పాఠశాల తప్పక రిజిస్టర్ కావాలని ఆదేశించారు. తల్లికి వందనం కూడా అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూలై 15న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. పేరుకే సమావేశం అన్నట్టుగా ఏర్పాటు చేస్తే కుదరదని, కచ్చితంగా పండగ వాతావరణంలో సమావేశాలను నిర్వహించాలన్నారు.

 

ఈ సమావేశంలో ఆర్జెడి జి.నాగమణి, డీఈఓ ఇ.నారాయణ, ఏడి సత్యనారాయణ, ఎస్ఎస్ఏ పై.ఓ జి.శ్యాంసుందర్, డిప్యూటీ డీఈవోలు భీమవరం, నరసాపురం ఎన్ రమేష్, మురళి సత్యనారాయణ, జిల్లా ఎంఈఓ ల అధ్యక్షులు రవీంద్ర, అపూసమ అధ్యక్షులు కిషోర్ కుమార్, ఎ పి ఎ ఎస్ అధ్యక్షులు మాణిక్యాలరావు, ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం, డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.

3.11