**పుస్తక పఠనంతోనే విజ్ఞానం – నైతిక విలువలు పెంపొందుతాయి.
*గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.
**విద్యార్థులు ప్రతిరోజూ న్యూస్ పేపర్లు, జీవిత చరిత్రలు చదవడం అలవాటు చేసుకోవాలి.
**59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం.
**-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
భీమవరం, 14 నవంబర్, 2026.
పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, నైతిక విలువలను అలవర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు.
శనివారం భీమవరం వన్ టౌన్లో డాక్టర్ బి.వి. రాజు పార్కు సమీపంలోని ప్రధమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
తోలుత విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విభిన్న అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవడం ద్వారా విస్తృతమైన జ్ఞానాన్ని, సమాజం పట్ల అవగాహనను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో లభించని అనేక విషయాలను తెలుసుకోవడానికి ప్రతిరోజూ న్యూస్ పేపర్లు చదవడాన్ని ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. నిత్యం వార్తాపత్రికలు చదవడం వల్ల సమాజంలో జరుగుతున్న పరిణామాలు, దేశ విదేశాల్లో చోటుచేసుకుంటున్న ముఖ్యమైన సంఘటనలు, వివిధ రంగాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. చదువును కేవలం పరీక్షల ఒత్తిడిగా భావించకుండా, ఇష్టంతో, ఆసక్తితో చదవాలని తెలిపారు. కథలు చదివినంత ఆసక్తికరంగా పుస్తకాలను చదివే అలవాటు చేసుకుంటే చదువుపై ఏకాగ్రత పెరిగి, మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం, సృజనాత్మక ఆలోచన దాగి ఉంటుందని, వాటిని వెలికితీయడానికి పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ విజ్ఞానదాయక పుస్తకాలను చదవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం రచించిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, జాతిపిత మహాత్మా గాంధీ రచించిన ‘మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’ వంటి మహనీయుల జీవిత చరిత్రలను గ్రంథాలయాల్లో చదవాలని సూచించారు.
మహనీయుల జీవిత ప్రయాణం, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని, వారి అనుభవాల నుంచి ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు హితవు పలికారు.
**భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సెల్ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా పిల్లల్లో పుస్తక పఠన అలవాటు గణనీయంగా తగ్గిపోతోందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన మేరకు వినియోగించుకుంటూనే, పుస్తక పఠనానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను గ్రంథాలయాలకు తీసుకువెళ్లి, అక్కడ కొంత సమయం గడిపేలా ప్రోత్సహించాలని కోరారు. గ్రంథాలయాల్లో వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల పిల్లల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, రచనా నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ వ్యవహారాలపై విస్తృత అవగాహన ఏర్పడి, వారి వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో భీమవరం మండల తహసీల్దార్ రావి రాంబాబు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లూరి నరసింహారాజు, మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి రాజు, అధ్యక్షులు ఎస్.ఎస్.ఎన్. రాజు, కో-చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి బాబు, కలిగొట్ల గోపాల శర్మ, గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, వడ్డి వెంకటేశ్వరరావు, డి.వి.ఎస్. చంద్రాజీ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శి అల్లు శ్రీనివాస్, గ్రంథాలయ అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సిబ్బంది సోమరాజు తదితరులు పాల్గొన్నారు.