పీఎం లంక అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి అన్ని విధాల చర్యలు చేపట్టారని, పిల్లలను పాఠశాలకు విధిగా పంపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెదమైనవానిలంక డిజిటల్ భవనాన్ని, పీఎం లంక సముద్రపు కోతకు గురయ్యే ప్రాంతంలో డెలాయిట్ కంపెనీ చేపట్టనున్న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు తదితరులు ఉన్నారు. తొలుత డిజిటల్ భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ సహకారంతో పీఎం లంకను అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుందని, పిల్లలు మాత్రం 6,7,8 తరగతులలో డ్రాప్స్ అవ్వకూడదని, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను మాత్రం చదివించాలని చాలా అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పీఎం లంక నందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యవేక్షణలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలకు వివరించారు. పి ఎమ్ సూర్యఘర్ పథకం కింద పిఎం లంక గ్రామంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు అనువైన 100 గృహాలకు ఎంపిక చేసి సబ్సిడీతో సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేయడం మరియు డిజిటల్ భవన్ కు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 15 నాటికి సోలార్ విద్యుత్ ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలని ఆదేశించారు. అలాగే రూ.40 లక్షల వ్యయంతో లైబ్రరీ భవనాన్ని, టాయిలెట్స్ నీటి సదుపాయం, ప్రహరీ గోడ నిర్మాణం, రూ.25 లక్షల వ్యయంతో అంగన్వాడి సెంటర్ నిర్మాణం, ప్రహరీ గోడ టాయిలెట్స్ నిర్మాణం, రూ.20 లక్షలతో కల్చరల్ ఓపెన్ ఆడిటోరియం ప్రహరీ గోడతో నిర్మాణంతో సహా, రూ.30 లక్షలతో మహిళా సమైక్య భవనం, రూ.40 లక్షలతో పీహెచ్సీ సబ్ సెంటర్ నుండి పడవల రేపు వరకు మరియు ఇతర ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణం, రూ.20 లక్షల వ్యయంతో డిజిటల్ భవనం నుండి స్మశాన వాటిక వరకు మరియు ఇతర ప్రాంతాలకు సిసి రోడ్ల నిర్మాణాలను మొత్తం ఆరు పనులను రూ.175 లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. పీఎం లంక ప్రాంతం సముద్రపు కోతకు గురి కావడం, దీనిని నిరోధించడానికి డెలాయిట్ కంపెనీ ఒక కిలోమీటర్ పరిధిలో సి.ఎస్.ఆర్ ఫండ్స్.తో స్ట్రక్చర్ నిర్మించే పనులను రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టడం జరుగుతుందన్నారు. కంపెనీ పనులకు అందరూ సహకరించాలని, నిర్మాణ సమయంలో పెద్ద పెద్ద వాహనాలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. గత 25 సంవత్సరాల క్రితం సముద్ర తీరంలో ఎర్ర మట్టి దిబ్బలు కనిపించేవని, సముద్రపు కోతకు గురి కావడం వలన నేడు అవి కనుమరుగయ్యాయనే విషయం మీ అందరికీ అందరికీ తెలిసిందేనన్నారు. ఇది మీ అందరి కోసం చేపట్టే గొప్ప ప్రాజెక్టుఅని, రెండున్నర కిలోమీటర్లు అడ్డుగోడ నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదించగా, తొలుత ఒక కిలోమీటర్ పరిధిలో చేపట్టడం జరుగుతుందని, తర్వాత ఒకటిన్నర కిలోమీటర్లు పరిధిలో కూడా విస్తరించడం జరుగుతుందని తెలిపారు.
నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడ నాయకర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన పీఎం లంక అభివృద్ధికి కేంద్రమంత్రి సీతారామన్ దత్తత తీసుకొని వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు. సోలార్ ప్యానల్స్ కూడా అమర్చడంతో నిరంతర విద్యుత్ ఎటువంటి ఖర్చు లేకుండా మీకు సమకూరుతుందన్నారు. ఈ ప్రాంతపు రైతులు ఉప్పుమడులపై ఆధారపడి జీవిస్తున్నారని, వర్షాలు కారణంగా రైతులు నష్టపోతున్నారని, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ విషయమై తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ భవన్ ద్వారా నైపుణ్యాలను పెంచుకొని ప్రయోజకులు కావాలని కోరారు. అభివృద్ధికి సహకరిస్తే మీ ప్రాంతానికి మంచి ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు.
అనంతరం పీఎం లంక సముద్రపు కోతకు గురయ్యే ప్రాంతంలో డెలాయిట్ కంపెనీ చేపట్టనున్న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్థానిక శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంలో రైతులతో మాట్లాడీ సముద్రపు కోత నిరోధక కట్ట ప్రయోజనాలను వివరించి ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో దాసిరాజు, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎ.రఘునాధబాబు, డ్వామా పిడి డా.కె.సిహెచ్ అప్పారావు, పంచాయతీరాజ్ ఎస్.ఇ కె.శ్రీనివాస్, జిల్లా టూరిజం శాఖ అధికారి అప్పారావు, సర్పంచ్ ఎం.శివకుమార్, ఇన్చార్జి తహసిల్దార్ ఐవివి సత్యనారాయణ, ఎంపీడీవో జీవీఎస్ కృష్ణంరాజు, పిఆర్ ఈఈ కె.శ్రీనివాసరావు, ఏఈ డి.నాగేశ్వరరావు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.