పి4లో భాగంగా సంపన్నులు దిగువ పేద వర్గాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ముందుకు రావాలి-ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

పి4 లో భాగంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబరులో రైస్ మిల్లర్స్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో దిగువ పేద వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో ఉన్న స్థితిమంతులు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తమ వంతు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారన్నారు. అదేవిధంగా పి4లో భాగంగా రైస్ మిల్లర్స్, సంపన్న రైతులు మార్గదర్శకులుగా రిజిస్టర్ చేసుకుని బంగారు కుటుంబాలుగా అర్హులైన పేదలను దత్తత తీసుకొని వారి అవసరాల మేరకు పేద విద్యార్థుల ఉన్నత చదువుకు, అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు వైద్యం అందించడం, నిరుద్యోగ పేద యువతకు ఉద్యోగ కల్పన ద్వారా చేయూతనిస్తే బంగారు కుటుంబాల వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీ రామరాజు స్పందిస్తూ తమ అసోసియేషన్ తరపున పేద వర్గాల పిల్లల ఉన్నత చదువులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి పురోభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ తరపున మార్గదర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ కంటిపూడి శ్రీనివాసరావు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.సరోజ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.