పి జి ఆర్ ఎస్ లో ప్రజలు అందజేసిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గత నెల రోజులుగా పి జి ఆర్ ఎస్ తాత్కాలికంగా నిలుపుదల చేసినందున, ఈరోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్జీదారులు జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని అర్జీలను సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో వచ్చిన సమస్యల అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కారం చేయాలని తహశీల్దార్లును ఆదేశించారు. తహశీల్దార్లు ప్రతి అర్జీని పరిశీలించి ఎండార్స్మెంట్లను ఇవ్వాలన్నారు. సంబంధిత ఆర్డీఓలు వారి పరిధిలోని మండలాలలో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆర్డీఓలను ఆదేశించారు. రీ ఓపెన్ కి అవకాశం లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులు, పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారానికి తహశీల్దార్లు వ్యక్తిగతంగా మండల పరిధిలో పర్యటించి ఆర్జీదారుల వద్ద సరైన పత్రాలను పొందడానికి నోటీసులు అందజేయాలన్నారు. ఈరోజు నిర్వహించిన పి జీ ఆర్ ఎస్ కు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 367 అర్జీలు స్వీకరించడం జరిగినదని కలెక్టర్ తెలిపారు.
వాటిలో కొన్ని ఫిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి
1* భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం నుండి ఆలామండ్ర ఏసుమణి మేము భార్యా భర్తల ఇద్దరము దివ్యాంగులము మాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు గొంతులో కణితి ఉంది డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఎన్టీఆర్ వైద్య కార్డును మంజూరు చేయాలని కోరారు.
2* ఆకీవీడు అమృత రావు కాలనీ స్మశాన వాటిక ఆక్రమణకు గురి అయినది చర్యలు తీసుకోవాలని శాల భాస్కరరావు ఫిర్యాదు చేశారు.
3* భీమవరం మండలం తుందూరు గ్రామం నుండి ఆకుల వెంకటేశ్వర్లు, తన కుమార్తె కస్తూరి కృష్ణవేణి గొల్లవానితిప్ప తనను మోసం చేసి వేలిముద్రలు తీసుకుని ఆస్తి తన పేరున రాయించుకుని వృద్ధాప్యంలో ఉన్న తను చూడటం లేదని ఫిర్యాదు చేశారు.
4* తణుకు మండలం వేల్పూరు గ్రామం కొట్టి శ్రీనివాసరావు 59 సంవత్సరాలు మూగవాడును ఒంటరిగా జీవించుచున్నాను నా తల్లి వారసత్వం నుండి వచ్చిన చిన్న ఇల్లు తప్ప ఏ ఆధారము లేదు నాకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ నిలిపివేశారు. పరిశీలించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు .
5* యలమంచిలి మండలం ఏనుగువాని లంక పంచాయితీ పోలవరం గ్రామం నుండి ఇంజమూరి పుల్లయ్య నాగమణి దంపతులు పంచాయితీ గుమస్తా సుబ్బారావు పాస్ పుస్తకములు వచ్చాయి సంతకాలు పెట్టాలని నిరసరాసులమైన మమ్ములను మోసము చేసి వేలిముద్రలు తీసుకుని అక్రమముగా మాకు చెందిన భూమిని మా ఇంటి పక్కన ఉంటున్న వంపన వెంకట సుబ్బరాజుకు మా భూమి 54 సెంట్లు రాసి ఇచ్చినారు, మా భూమి మాకు ఇప్పించి చేయాలనికోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, వయోవృద్ధుల ట్రిబునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.