Close

పిల్లల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు.

Publish Date : 06/01/2025

శనివారం వీరవాసరం ఎం ఆర్ కె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సభా అధ్యక్షులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ భవిష్యత్తుకు ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి విద్య వలన సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విద్య కు పెద్దపీట వేసి అత్యధిక నిధులను కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో మౌలిక వసతులు కల్పిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తద్వారా మంచి విద్యను నేర్చుకుని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజా ప్రయోజనాలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. పాఠ్యపుస్తకాల నుండే సాంకేతికత అంది వస్తుందని, వాటిని బాగా చదివి ఆకళిoపు చేసుకోవాలన్నారు. విజ్ఞాన సదస్సులు ఏర్పాటు వలన విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన, పరిశోధనల పట్ల ఉత్సుకత ఏర్పడుతుందన్నారు. మన జిల్లాలోని భీమవరంకు చెందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ ప్లేగు వ్యాధి శాశ్వతంగా నివారించడానికి, క్యాన్సర్ నిరోధకానికి మేధోట్రెకేసేట్, ఫైలేరియా వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా నేటికీ వినియోగిస్తున్న హెట్రాజన్ ఔషధాన్ని, మొదలగు యాంటీబయోటిక్స్ ను కనిపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూఢనమ్మకాలు లేని సమాజ నిర్మాణానికి సైంటిఫిక్ జ్ఞానాన్ని పొందడం ద్వారా సాధ్యం అన్నారు. పిల్లలు యూట్యూబ్ లో అనవసరమైనవి చూడకుండా విజ్ఞానాన్ని పెంచే విషయాలను చూసి తెలుసుకోవాలని తెలిపారు. చివరి వరకు నేర్చుకుంటూనే ఉంటాను అనే డాక్టర్ అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోని భవిష్యత్తులో విజయవంతంగా రాణించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన విద్యను అందించగల గొప్పవారని, వీరందరూ ప్రభుత్వ పోటీ పరీక్షలలో విజయం సాధించి, నాణ్యమైన శిక్షణ అనంతరం ఉపాధ్యాయలుగా నియమించబడతారని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా ఎప్పుటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యార్థులకు నేర్పించాలని ఈ సందర్భంగా సూచించారు.

ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ సైన్స్ విద్య విద్యార్థుల్లోని అంతర్గత శక్తులను వెలికితీస్తుందని, దీనికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సాంకేతిక పరికరాలు కార్పొరేట్ సంస్థలకు కాకుండా సమాజానికి, పేద ప్రజలకు ఉపయోగపడేవి కనుగొలన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా అన్ని విషయాల్లో జీవితంలో ముందడుగు వేస్తారు అన్నారు. ప్రయోగాలు చేసి నిత్య జీవితంలో వినియోగించుకునేవి కనుగొనాలన్నారు. రైతులకు, శ్రామిక వర్గాలకు, సమాజానికి సైన్స్ దోహదపడాలన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపికైన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయిలో, దక్షిణ భారత స్థాయిలో సైన్స్ ఫెయిర్ విజేతలుగా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు శాసనసభ్యులు భారతమాత విగ్రహానికి పూలమాలను అలంకరించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా డాక్టర్ ఎబిజె అబ్దుల్ కలాం, సర్ సి.వి.రామన్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్, శాసనమండలి సభ్యులు, తదితరులు నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చివరిగా సైన్స్ ఫెయిర్ సెల్ఫీ పాయింట్ వద్ద శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్, శాసనమండలి సభ్యులు సెల్ఫీలను తీసుకోవడం విద్యార్థుల్లో ఉత్సాహన్ని నింపాయి.

20 మండలాల స్థాయిలో నిర్వహించిన పోటీలలో 20 మండలాల నుండి మూడు విభాగాలలో వ్యక్తిగత విభాగం, బృందవిభాగం, ఉపాధ్యాయ విభాగంలో జిల్లాస్థాయికి ఎంపికైన 60 ప్రదర్శనలను శాసన సభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్, శాసన మండల సభ్యులు సంయుక్తంగా ప్రారంభించి, తిలకించి పరిశోధన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఎస్ ఎస్ ఏ ఏపీసి పి.శ్యామ్ సుందర్, జిల్లా సైన్స్ అధికారి విఎంజెడ్ శ్యామ్ ప్రసాద్, జడ్పిటిసి జి.జయ ప్రకాష్ నాయుడు, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జె.శ్రీనివాసరావు, తాహసిల్దార్ రామాంజనేయులు, ఎంపీడీవో కె.కిరణ్ కుమార్, మండల ప్రెసిడెంట్ వి.దుర్గాభవాని, వీరవాసరం ఎంపీటీసీ జి.విజయలక్ష్మి, వివి లక్ష్మి, స్థానిక నాయకులు మెంటే పార్థసారథి, ఎస్.కమల, ఏ.మౌనిక, ఎంఈఓలు, విద్యాశాఖ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.