Close

పిల్లలలో చక్కటి ఆరోగ్యం మంచి విద్యకు బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 17/02/2025

సోమవారం భీమవరం శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల (ఎస్ సి హెచ్ బి ఆర్ ఎం స్కూల్) ప్రాంగణం నందు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం” (ఆర్ బి ఎస్ కే) వాహనాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం కింద శిక్షణ పొందిన మొబైల్ హెల్త్ టీమ్‌ ద్వారా పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 4డి గా పిలిచే పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు, ఇతర లోపాలు, ఎదుగుదలలో లోపాలు ఇలా తదితర 32 సాధారణ ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించడం, ఉచిత చికిత్స, నిర్వహణ, అవసరమైన వారికి శస్త్రచికిత్సలతో సహా స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. వీరిని కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక వాహనం ద్వారా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటుచేసిన జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం (డిఇఐసి)కి పంపి వారికి అవసరమైన చికిత్సను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ డిఇఐసి కేంద్రంను ప్రత్యేకంగా పిల్లల వైద్యులు, మెడికల్ అధికారి, డెంటల్ సర్జన్, ఫిజియోథెర్పిస్ట్, సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోలాజిస్ట్ మరియు స్విచ్ తెర్పిస్ట్, ఆప్తోమీటరిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టాప్ నర్సులు, తదితర 14 మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. జిల్లాలో అందుబాటులో లేని వైద్య సేవలకు రాష్ట్ర స్థాయి హాస్పటల్స్ కు రిఫర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలోని విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు టైం షెడ్యూల్ ను రూపొందించి అందుకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. పిల్లలలోని అనారోగ్య లోపాలను ముందస్తుగా గుర్తిస్తే తగిన చికిత్స చేయడానికి వీలవుతుందన్నారు. తద్వారా వారు మంచి ఆరోగ్యంతో చదువుపై దృష్టిసారించి మంచి భవిష్యత్ ను పొందగలరన్నారు. కొన్ని అనారోగ్య కారణాలను తొలి దశలో గుర్తించకపోతే జీవితాంతం అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారి పిల్లలకు ధైర్యం చెప్పి వైద్య పరీక్షలకు సహకరించాలన్నారు. సొంతంగా వైద్యం చేయించాలంటే ఇటువంటి అనారోగ్య చికిత్సలకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, దీనిని ఉచితంగా ప్రభుత్వమే అందించడం ద్వారా పిల్లలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ఆమె తెలిపారు. జిల్లాలోనీ అంగన్వాడి, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1,98,895 పిల్లలకుగాను తొలి దశలో ఏఎన్ఎం, పారామెడికల్ సిబ్బంది ఫిబ్రవరి 12 నాటికి 1,39,811 మంది పిల్లల సర్వేను పూర్తి చేసి, 5,801 మంది పిల్లలలో అనారోగ్య కారణాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరిలో 3,416 మంది పిల్లలను మెడికల్ అధికారి స్క్రీనింగ్ చేసి 4 డిఎస్ పరిదిలో వున్న అనారోగ్య సమస్యలను 1,043 మంది పిల్లల్లో గుర్తించి తణుకులోని జిల్లా బాలల సత్ర చికిత్స కేంద్రం నందు వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తొలుత జిల్లా కలెక్టర్ ఎస్ సి హెచ్ బి ఆర్ ఎం స్కూల్ నందు 4 డిఎస్ పరిధిలోకి వచ్చే చికిత్సలకు గుర్తించిన విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి ఉన్న అనారోగ్య సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్తహీనతతో బాధపడేవారు ఆకుకూరలు తింటే ఆరోగ్యవంతులు అవుతారని తెలిపారు. ప్యాక్డ్ ఫుడ్స్ వంటి కురుకురేలు, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం బాగా తగ్గించాలని, పూర్తిగా మానేస్తే ఇంకా మంచిదని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాను నాయక్, ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ సి హెచ్.భావన, డీఈవో ఇ.నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు, కరస్పాండెంట్ కె.రామకృష్ణంరాజు, డిఎన్ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణ రాజు, ఏఎన్ఎంలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

1.11 1.22