పిల్లలందరూ, మరి ముఖ్యంగా బాలికలు అందరూ మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలల నందే స్వీకరించాలి
విస్సాకోడేరు జడ్పీ స్కూల్ నందు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్..
ప్రభుత్వం మంచి పోషక విలువలతో కూడిన మెనూతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నదని తల్లిదండ్రులు, విద్యార్థులు గ్రహించాలి
విద్యార్థులు పాఠశాల నుందే మధ్యాహ్నం భోజనం చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చినప్పుడే చదువులో రాణింపు ఉంటుందని హితువు
నేడు అధికారులందరూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మూకుమ్మడి తనిఖీలు..
తరచూ అధికారులు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనం స్వయంగా రుచి చూడాలి
విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాల నాణ్యతపై సమాచారాన్ని తెలుసుకోవాలి
పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిణామాల్లో అలసత్వం వహించే వంట వారిపై చర్యలు ఉంటాయి
…. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెనుకాడకుండా మంచి పౌష్టిక విలువలు కలిగిన చక్కటి మెనూ తయారు చేయించి “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” పేరున ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నదని, ప్రతి ఒక్క విద్యార్థి మధ్యాహ్నం భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పాలకోడేరు మండలం విస్సాకోడేరు జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పదార్థాలను తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పౌష్టిక ఆహారంపై ప్రతి ఒక్క తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వారి పిల్లలు మధ్యాహ్నం భోజనం పాఠశాలల్లోనే ఎందుకు చేయాలో ఆలోచన ఉంటుందన్నారు. సమతుల ఆహారం ద్వారా విద్యార్థులలో మానసిక, శారీరక ఎదుగుదలతో పాటు, చదువులో రాణించగలరన్నారు. మన ఇంట్లో సాధారణంగా అన్నం, ఒక కూరతోనే భోజనాన్ని ముగిస్తామని, అలా కాకుండా మధ్యాహ్న భోజనంలో మంచి పోషక విలువ లభించే ప్రతి రోజు గుడ్డు (శనివారం మినహా), వారానికి రెండు రోజులు ఆకుకూరలతో కలిపి పప్పు, కాయగూరలు, సాంబారు లేదా రసం, వారానికి ఒకరోజు స్వీట్, ఒకరోజు వెజ్ బిర్యానీ, తదితర పదార్థాలను విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. ఇంత చక్కటి ఆహారాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా భుజించాలన్నారు. ఈరోజు జిల్లాలోని పాఠశాలల్లో ఒక్కొక్క అధికారి ఒక్కొక్క పాఠశాలలో ఒకేసారి మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసేందుకు ఆదేశించడం జరిగిందని, అన్ని పాఠశాలలో పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజనం పథకాన్ని అధికారులు పరిశీలించడం జరిగిందన్నారు. మధ్యాహ్న భోజన పథకం తనిఖీలోన్ జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొనడం జరిగిందన్నారు. నాణ్యత, పరిశుభ్రత, పరిమాణం తదితర అంశాలను పరిశీలించి నివేదిక అందజేస్తారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ నేలపై కూర్చుని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ వారితో కొద్ది సమయం ముచ్చటించారు. రోజు పాఠశాలలోనే ఎందుకు మధ్యాహ్న భోజనం చేయాలో వివరించారు. ఇంత చక్కటి పోషక విలువలు కలిగిన భోజనం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుందో విపులంగా వివరించారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే చక్కటి దేహదారుద్యంతో చదువుల్లో, ఆటల్లో రాణించగలుగుతారని, తద్వారా మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారని హితవు పలికారు. ముఖ్యంగా ఆడపిల్లలు పాఠశాల నందే మధ్యాహ్నం భోజనం భుజించాలని ప్రమాణం తీసుకున్నారు.
విద్యార్థులకు బాసటగా జిల్లా అధికారులు ఉంటారు, ఏ విషయమైనా నిర్భయంగా తెలియజేయండి
చదువులో రాణిస్తేనే ఆర్థికంగా, సామాజికంగా జీవితంలో ఉన్నతంగా స్థిరపడతారన్నారు. చదువుకునే వయసులో చదువు పైనే దృష్టి పెట్టాలని, ఇతర తాత్కాలిక ఆకర్షణలకు లోనైతే భవిష్యత్తు అస్తవ్యస్తంగా ఉంటుందన్నారు. ఉన్నత చదువు ద్వారా సమాజంలో గుర్తింపుతో పాటు సొంత కాళ్లపై స్థిరపడేందుకు దోహదపడుతుందన్నారు. ఏ విషయమైనా మీ వద్దకు వచ్చే అధికారులకు గాని, మీ జిల్లా కలెక్టర్ కు గాని నిరభ్యంతరంగా సమాచారాన్ని అందించవచ్చని, మీ చదువులు, వ్యక్తిగత విషయాలపై జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని తెలిపారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చినప్పుడే రాణింపు ఉంటుందని హితువు పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతీరాజ్ ఏ.ఇ వివిఎస్ విజయ్ కుమార్ రాజు, పాఠశాల హెచ్ఎం పఠాన్ భాషా ఖాన్, ఈఓపిఆర్డి మల్లాది రాంప్రసాద్, జెఎస్పి నాయకుడు గాదం నానాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.