పిటీఎం కు పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు
పిటిఎం (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం) విద్యార్థుల భవిష్యత్ కి ఒక చుక్కాని ..
నేటి బావి పౌరులకు దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం పిటిఎం ఏర్పాటు..
పండుగ వాతావరణంలో సాగిన తల్లితండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.
పాలకోడేరు మండలం వేండ్ర జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలి..
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి.
.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
గురువారం పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలోని శ్రీ భూపతి రాజు సుబ్బ తాతరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కూడా పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ. నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యా యులు జీవివి శ్రీనివాస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సాధించిన ప్రగతి, ఉత్తీర్ణత శాతం తదితర వివరాలను వివరించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ జిల్లా విద్యాశాఖ ప్రగతిని సభలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా అంతటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఈరోజు పండుగ వాతావరణంలో గురు పౌర్ణమి రోజున పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకున్నామన్నారు. ప్రభుత్వం ఒక నిర్దేశిత లక్ష్యంతో పిటిఎం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం విద్యార్థులకు ఒక చుక్కానిలా దోహదపడుతుందన్నారు. సుమారు జిల్లా వ్యాప్తంగా 1,960 వున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారన్నారు. ఈ ఆత్మీయ సమావేశాల ద్వారా పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేది తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. తద్వారా విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు స్కూలు నుండి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటున్నారు గమనించాలన్నారు. సమాజంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమని, తల్లి జన్మనిస్తుందని, గురువు జ్ఞానాన్ని బోధిస్తారని, కావున విద్యార్థులు ఎల్లప్పుడు తల్లి,తండ్రి,గురువులకు కృతజ్ఞులుగా ఉండాలన్నారు. పిల్లలు తల్లిదండ్రుల చెప్పిన మాట విని వారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలన్నారు. దూమ పానం, మద్యపానం, డ్రగ్స్ పంటి చెడు వ్యసనాలకు విద్యార్థులు ఎప్పటికీ ఆకర్షితులు కాకూడదన్నారు. చెడు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినట్లు ఉన్నా, వెలుగులు నింపే జీవితకాలం ఆనందానికి దూరం కావాల్సి వస్తుందని ఇది ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. తల్లిదండ్రులు తాహతకు మించి అప్పులు చేసి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించిన ఇద్దరు విద్యార్థులు కేతా సుమ, రేలంగి భరత్ కుమార్ త్రిబుల్ ఐటీ లో సీటు సంపాదించడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని, ఏ విద్యార్థికి ఎలా బోధించాలో బాగా తెలుసునన్నారు. ఈ సందర్భంలో ఇరువురు విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు శ్రద్ధగా చదివి ఆ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా అమ్మ పేరుతో మొక్కలు నాటేందుకు జిల్లా కలెక్టర్ విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తరచూ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువు కుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులు తల్లుల పాదాలను కడిగి పూజ చేయడం ఎంతో కన్నుల పండుగలా జరిగింది.
జిల్లా సూపరింటెండెంట్ ఆ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకుల కావాలన్నారు. ఇటీవల విద్యార్థులు మొబైల్ వినియోగానికి బానిసలై చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని, తల్లిదండ్రులు విద్యార్థుల చదువు పట్ల, వారి ప్రవర్తన పట్ల ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలపై, నూతన నైపుణ్యాలు సాధించే దిశగా దృష్టి సారించాలన్నారు. లాభాపేక్షతో కొంతమంది వ్యక్తులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి, డ్రగ్స్ వినియోగానికి ప్రోత్సహిస్తున్నారని విద్యార్థుల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే అటువంటి వారిని శిక్షించడం జరుగుతుందన్నారు.
చివరిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేసి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యా యులు జీవివి శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగాచార్యులు, విద్యాశాఖ ఎడి ఎన్. త్యనారాయణ, ఎంఇఒ-1 పి.వి.ఎస్.నాగరాజు, ఎంఇఒ-2 ఎం.ఎన్.శ్రీమన్నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శ్రీమతి కడలి నాగేశ్వరి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కడలి వెంకట ఫణి కుమారి, వైస్ చైర్మన్ బండారు వెంకట కనకారావు, గ్రామ పెద్దలు, పాఠశాల పూర్వ విద్యార్థులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.