• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి-జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.

Publish Date : 28/07/2025

ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి.

అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి.

సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, డిపిఓ ఎం.రామ్ నాథరెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 234 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో అధికారులు మాట్లాడాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

ఈరోజు పీజీఆర్ఎస్ కి అందిన దరఖాస్తులలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

@ నరసాపురం మండలం మల్లవరంకు చెందిన బుంగ జయకుమారి అర్జీ సమర్పిస్తూ, తనకు 1.31 సెంట్ల భూమి ఉందని, రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని, ఆన్లైన్ లో నమోదు కాలేదన్నారు. ఆ భూమిని ఆన్లైన్లో నమోదు చేయించాలని కోరారు.

@ పోడూరు మండలం పెమ్మరాజు పోలవరం గ్రామానికి చెందిన టి.బసవమ్మ అర్జీని సమర్పిస్తూ, తాను ఒంటరి మహిళలనని, అనారోగ్యంతో బాధపడుతున్నానని తనుకు 15 వేల రూపాయల పింఛను మంజూరు చేయాలని కోరారు.

@ ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన పి.వి సత్యవతి అర్జీ సమర్పిస్తూ, తాము యండగండి గ్రామం ఎస్.కొండేపాడు రోడ్డు మార్జిన్ స్థలాల్లో వివిధ కులాలకు చెందిన పేదలు గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నామని, ఇటీవల మాకు జగన్ కాలనిలో స్థలాల మంజూరు అయ్యాయని, ఇంటి నిర్మాణం కాలేదన్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇళ్ళను అధికారులు ఖాళీ చేయమంటున్నారని, ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా ఇల్లు ఖాళీ చేయడానికి డిసెంబర్ నెల వరకు గడువు ఇప్పించాలని కోరుతున్నారు.

. @ కొమ్మర గ్రామానికి చెందిన మంతెన తరుణ్ వర్మ అర్జీ సమర్పిస్తూ, తనకు 4.39 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వ రీ సర్వేలో 10 సెంట్లు భూమి తక్కువ చూపిస్తున్నదని, దయచేసి తిరిగి సర్వే చేసి తన 10 సెంట్లు భూమిని ఇప్పించి సరిహద్దులు నిర్ణయించాలని కోరారు.

@ భీమవరం 8వ వార్డుకు చెందిన షేక్ చాందిని తన కుమారుడు చినరంగనిపాలెం మున్సిపల్ హైస్కూల్లో హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడని ఇంతవరకు తల్లికి వందనం సొమ్ము జమ కాలేదని, దయచేసి తల్లికి వందనం సొమ్ము ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు.

@ తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఆకుల నాగ దుర్గ తన భర్త గత సంవత్సరం చనిపోయారని, తనకు వితంతు పింఛను ఇప్పించాలని అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.