పిజిఆర్ఎస్ అర్జీలకు నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.

సమస్య తమ శాఖ పరిధిలోనికి రాని పక్షంలో నిర్ణీత గడువు వరకు ఉంచకుండా వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేయాలి
.. జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి
సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, అధికారులు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని చక్కని పరిష్కారాన్ని చూపించాలని, పరిష్కారం కానీ సమస్యలు ఉంటే అర్జీదారునికి ఏ కారణం చేత సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నామో అర్థమయ్యేలా వివరించాలన్నారు.
ఈ రోజు జరిగిన పి జి ఆర్ ఎస్ ద్వారా 187 అర్జులను స్వీకరించగా వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
@ పెంటపాడు మండలం ప్రత్తిపాడు శివారు పగులంపాడు గ్రామానికి చెందిన గజ్జరపు శంకరనారాయణ అర్జీని సమర్పిస్తూ నా ఇద్దరు కుమార్తెలు, నా భార్య నన్ను ఇంటి నుంచి గెంటేసారని, నేను ప్రస్తుతం ఉండ్రాజవరం వద్ద ఆశ్రమంలో డబ్బులు కట్టి ఉంటున్నానని, ఇప్పటివరకు నా మిత్రులు ఆశ్రమానికి డబ్బు కట్టారని, ప్రస్తుతం వారు కూడా డబ్బు కట్టలేమన్నారని, నా సమస్య గురించి తాడేపల్లిగూడెం ఆర్డీవో గారికి విన్నవించగా నాకు ఏ విధమైన న్యాయం జరగలేదన్నారు. డబ్బు కట్టకపోతే ఆశ్రమం నుండి బయటకు వెళ్లి పొమ్మంటున్నారని, కావున నాకు న్యాయం చేయాలని కోరారు.
@ భీమవరంలోని బలుసుమూడికి చెందిన రమణ కాక్షాయిని దేవి అర్జీని సమర్పిస్తూ, తాను వికలాంగురాలునని (90 శాతం ఆర్థోపెటిక్) ప్రస్తుతం నెలకు 6 వేలు పింఛను పొందుతున్నానని, తాను నిలబడే పరిస్థితి లేదని వీల్ చైర్ కు మాత్రమే పరిమితమయ్యానని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని తనకు ప్రభుత్వం ఇచ్చే 15 వేల రూపాయలు పించన్ మంజూరు చేయాలని కోరారు.
@ పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంకు చెందిన వేదాల రాంబాబు తనకు ముగ్గురు కుమారులని, తన రెండో కుమారుడైన వేదాల రమేష్ ములపర్రు గ్రామంలో నివాసం ఉంటున్నాడని, అతనికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారని వారి ఉన్నత చదువుల కోసం నా పెద్ద కుమారుడు, మూడో కుమారుడు నుండి 20 లక్షల రూపాయలు ఇప్పించానని, అంతేకాకుండా ఒక ఎకరం పొలం కూడా అతనికి రిజిస్టర్ చేయడం జరిగిందని, అప్పటినుండి నా యోగక్షేమాలు పట్టించుకోవడం లేదన్నారు. వాడి సోదరులకు డబ్బు తిరిగి ఇవ్వకుండా, నా యోగక్షేమాలు పట్టించుకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడని, కావున నా కుమారుడు రమేష్ పై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా అర్జీని సమర్పించారు.
భీమవరం మండలం, గొల్లవానితిప్ప గ్రామస్తుడు నవ్వుండ్రు రాజేంద్రప్రసాద్ అర్జీని సమర్పిస్తూ, తనకు భీమవరం పట్టణంలో 150 గజాల స్థలం ఉందని దానిలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నానని, బ్యాంకు లోనుకు దరఖాస్తు చేసుకోగా మున్సిపాలిటీ వారి నుండి ప్లాన్ కావాలన్నారు. దీనిపై మున్సిపాలిటీని సంప్రదించగా స్వీయ దృవీకరణ సరిపోతుందని ఫ్లెక్సీలు పెట్టారన్నారు. ప్లాను ఇవ్వకపోతే బ్యాంకు రుణం మంజూరు కాదని, కావున దయచేసి మున్సిపాలిటీ వారు బ్లూ ప్రింట్ ప్లాన్ ఇచ్చే విధంగా మున్సిపాలిటీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు.
@ భీమవరానికి చెందిన ఆకుల రమేష్ అర్జీ సమర్పిస్తూ భీమవరం రూరల్ మండలం దిరుసుమర్రు గ్రామపంచాయతీ అవినీతికి చిరునామాగా మారిందని, అధికారులు, ఉద్యోగులు అంతా ఏకమై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కార్యదర్శి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని, పంచాయతీ నిధులు నేరుగా తన సొంత అకౌంట్ కి బదిలీ చేసుకుంటున్నారని, 2019 నుండి 2025 ఏప్రిల్ వరకు అధికారులతో పూర్తిస్థాయి విచారణ జరిపించి దోషుల పై చట్టపరమైన తీసుకోవాలని కోరారు.
@ భీమవరం మండలం యనమదుర్రు గ్రామపంచాయతీ డేగాపురం ఏరియా రైతులు అర్జీ సమర్పిస్తూ, మా పంట పొలాలకు నీరు వెళ్ళుటకు మరియు ఉమ్మడి పుంత మార్గం ఉందని, కొంతమంది బోది ఆక్రమించుకుని చెత్తా చెదారంతో పూడ్చి వేయడం, బోధిలో మురికి నీటిని వదలడం వల్ల పంట నీరు కలుషితం అవుతోందని, కావున పూర్వం నుండి ఉన్న పుంతను సర్వే చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా చూసి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, వయోవృద్ధుల ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గా ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.