Close

పారిశుధ్య కార్యకలాపాలలో అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రకటన

Publish Date : 02/10/2025

పశ్చిమగోదావరి జిల్లా ఒక రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం

భారతదేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వేను నిర్వహించడం జరిగింది.

అవార్డు గ్రహీతలు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగం తగ్గించు రీసైకిల్, స్థిరమైన పద్ధతులలో కొత్త ప్రమాణాలు విభాగాలలో ఈ వార్డులను గెలుచుకోవడం జరిగింది

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 జిల్లా స్థాయి అవార్డు విజేతలకు అక్టోబర్ 06న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో సత్కారం.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో ఒకటి, జిల్లాస్థాయిలో 49 స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను గెలుపొందినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణలో ఒక రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
భారతదేశంలోనే ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వేను నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. పారిశుధ్య కార్యకలాపాలలో అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రకటించింది అన్నారు. 17 విభాగాల్లో నిర్వహించిన సర్వేలో అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడం జరిగిందని, వాటిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగం తగ్గించు రీసైకిల్, స్థిరమైన పద్ధతులలో కొత్త ప్రమాణాలు, తదితర విభాగాలు ఉన్నాయన్నారు. ఈ అవార్డులు ఎంపికలో స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన వివిధ వర్గాలను కవర్ చేయడం జరిగిందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 యొక్క రేటింగ్, ర్యాంకింగ్‌ ఎంపిక స్వీయ అంచనా, జిల్లా అధికారుల ధ్రువీకరణ, రాష్ట్ర స్థాయి మూడు దశలలో నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ స్వీయ అంచనాలో 1,20,057 కేంద్రాలు పాల్గొన్నాయని, వాటిలో 1,12,833 కేంద్రాలను రెండవ దశ జిల్లా స్థాయిలో ధ్రువీకరించడం జరిగిందని, వీటిలో మూడో దశలో 62 రాష్ట్ర స్థాయిలో, 1,317 జిల్లా స్థాయి నామినేషన్లను అవార్డులకు పరిశీలించడం జరిగిందని తెలిపారు. వీటిలో మన జిల్లా ఒక రాష్ట్ర స్థాయి అవార్డును, 49 జిల్లా స్థాయి అవార్డులను గెలుపొందడం జరిగిందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 రాష్ట్రస్థాయి అవార్డులను అక్టోబర్ 6న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగాను, జిల్లా స్థాయి అవార్డు విజేతలకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో సత్కరించి అందజేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలు వీరే

*తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర స్థాయి అవార్డు కింద బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ విభాగంలో బొబ్బిలి రామాంజనేయులను ఇంటికి చేయడం జరిగింది.

*జిల్లాస్థాయి అవార్డులు

బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్ విభాగంలో ఎంపికైన వారిలో ఉండి మండలం వేండ్రం గ్రామపంచాయతీ కోనాల ఆనందరావు, మహదేవపట్నం గ్రామపంచాయతీ పి.దాసు, తణుకు మండలం తేతలి గ్రామపంచాయతీ బట్చల రామచంద్రం, పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామపంచాయతీ సోమదుల దుర్గాప్రసాద్, తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి కండెల్లి రాములు ఉన్నారు.

బెస్ట్ స్వచ్ఛత ఎన్జీవోస్ విభాగంలో ఎంపికైన వారిలో భీమవరం శ్రీ విజ్ఞాన వేదిక చెరుకువాడ శ్రీరంగ సాయి, ప్రశాంతి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కంతేటి వెంకటరాజు, కాళ్ల మండలం పెద్ద అమిరం పెద్దమి రామ్ వివేకానంద సేవాసమితి డి.నారాయణ రాజు ఉన్నారు.

బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ విభాగంలో ఎంపికైన వారిలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మల్లిపూడి ముత్యాలు, పాలకొల్లు మున్సిపాలిటీ ఆకులు వెంకటరమణ, తణుకు మున్సిపాలిటీ తణుకు లక్ష్మి, ఆకివీడు మున్సిపాలిటీ బంగారు శ్యాంబాబు ఉన్నారు.

స్వచ్ఛ అంగన్వాడీలు విభాగంలో ఎంపికైన వారిలో తణుకు మండలం కోనాల అంగన్వాడి డి.లక్ష్మీ సుజాత, నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం అంగన్వాడి దెందుకూరి విజయలక్ష్మి, పాలకోడేరు మండలం మైపా అంగన్వాడి కె.జ్యోతిలక్ష్మి, భీమవరం మండలం రాయడం అంగన్వాడి సిహెచ్ మహాలక్ష్మి, ఇనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపర్రు అంగన్వాడి దొమ్మేడి కనకదుర్గ ఉన్నారు.

బెస్ట్ బస్ స్టేషన్స్ విభాగంలో ఎంపికైనవాటిలో నరసాపురం బస్ స్టేషన్.

స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు విభాగంలో ఎంపికైన వాటిలో నెల్లిమర్ల నగర పంచాయతీ, నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్, చిన్న అమిరం గ్రామపంచాయతీ ఉన్నాయి.

స్వచ్ఛ గ్రామ పంచాయతీలు విభాగంలో ఎంపికైన వాటిలో ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామపంచాయతీ, తణుకు మండలం తేతలి గ్రామపంచాయతీ, పాలకోడేరు మండలం వేండ్ర గ్రామపంచాయతీ, ఉండి మండలం వాండ్రం గ్రామపంచాయతీ, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామపంచాయతీ ఉన్నాయి.

స్వచ్ఛ ప్రభుత్వ హాస్పిటల్స్ విభాగంలో పాలకొల్లు మండలం లంకలకోడేరు పిహెచ్సి, తణుకు తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జిఏడి వెంప ఉన్నాయి.

స్వచ్ఛ వసతి గృహాలు విభాగంలో నర్సాపురం ఎస్.డబ్ల్యూ కాలేజ్ బాయ్స్ హాస్టల్, గవర్నమెంట్ బిసి బాయ్స్ హాస్టల్ ఉన్నాయి.

స్వచ్ఛ పరిశ్రమలు విభాగంలో ఎంపికైన వాటిలో భీమవరం మండలం రాయలం జగదీష్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తుందుర్రు గ్రామం గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఉన్నాయి.

స్వచ్ఛ మున్సిపాలిటీస్ విభాగంలో భీమవరం మున్సిపాలిటీ ఎంపిక అయ్యింది.

స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్స్ విభాగంలో ఆచంట మండలం పెనుగొండ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం ఎంపికయింది.

స్వచ్ఛ రైతు బజార్సు విభాగంలో అత్తిలి రైతు బజార్ ఎంపికయింది.

స్వచ్ఛ స్కూల్స్ విభాగంలో అత్తిలి గర్ల్స్ హై స్కూల్, వీరవాసరం జడ్పీహెచ్ స్కూల్, పాలకోడేరు జడ్పీహెచ్ స్కూల్, భీమవరం జే.ఎల్.బి మున్సిపల్ హై స్కూల్, వెంకట్రావు పాలెం ఎంపీపీ స్కూల్ ఎంపికయ్యాయి.

స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ఎస్ (SLFs) విభాగంలో పాలకొల్లు మండలం క్రిస్టియన్ పేట, తాడేపల్లిగూడెం మండలం ఓల్డ్ టౌన్ హరిజనవాడ, నరసాపురం మండలం అరుంధతి పేట ఎంపికయ్యాయి.

స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ విభాగంలో ఆకువీడు మండలం చిన్నమిల్లిపాడు, పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, భీమవరం మండలం గొల్లవాని తిప్ప, అత్తిలి మండలం కొమ్మర, నరసాపురం మండలం సీతారామపురం నార్త్ ఎంపికయ్యాయి.

ఈ వివరాలను సాసా పోర్టల్ https://sasa.ap.gov.in నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 విజేతలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. రానున్న సంవత్సరాల్లో మరిన్ని ఎక్కువ అవార్డులను గెలవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు.