పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ తో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జూన్ 12వ తేదీని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 1 నుండి జూన్ 30 వరకు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ బృందాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాల కార్మికులను రక్షించడం, పాఠశాల విద్య మరియు సమర్థవంతమైన పునరావాసం కోసం లైన్ విభాగాల ప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ, విద్యా శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవా అథారిటీ, బాలల రక్షణ అధికారి మరియు చైల్డ్ లైన్, స్వచ్ఛంద సంస్థలు, బి బి ఏ వంటి సంబంధిత లైన్ విభాగాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కమిటీ సభ్యులందరి సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో పాటు కార్మిక శాఖ అధికారులు రైల్వే స్టేషన్లు, హోటళ్ళు, ధాబాలు, బార్లు, రెస్టారెంట్లు, ఇటుక బట్టీలు, దుకాణాలు & సంస్థలు, భవనాలు మరియు ఇతర నిర్మాణ పనుల ప్రదేశాలు, ఆటో మొబైల్ వర్క్‌షాప్‌లు, గృహ పని ప్రదేశాలలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను నియమించడాన్ని, 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ కార్మికులను గుర్తించాలన్నారు. బాల మరియు కౌమార కార్మిక చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం వృత్తులు మరియు ప్రక్రియలలో పిల్లలను నియమించడాన్ని నిషేధించడం జరిగిందన్నారు. తనిఖీ చేసిన ప్రదేశాలలో బాలల పట్టుపడితే బాల మరియు కౌమార కార్మిక చట్టం, 1986 లోని సెక్షన్ 3 & సెక్షన్ 3A నిబంధనలను ఉల్లంఘించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల మరియు కౌమార కార్మికులను ప్రోత్సహించకపోవడం ప్రతి శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని, బడి బయట ఉంటే వారిని బాల కార్మికుల కింద గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ముఖ్యంగా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన పిల్లలు 6, 7, 8 తరగతులలో బడి మధ్యలో మానేస్తున్నారన్నారని, అట్టివారిని గుర్తించి తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలన్నారు. జిల్లాలో ఎటువంటి డ్రాపౌట్స్ లేకుండా చూసుకోవాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి బిడ్డ పాఠశాలలో ఉండేలా చూడాలని విద్యా శాఖను ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసు శాఖ తమ వంతు సహాయ సహకారాలను అందించాలన్నారు. తహసిల్దార్లు, ఎంపీడీవోలు తమ పరిధిలో బాల కార్మిక నిర్మూలనకు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఏదైనా గమనించినట్లయితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ముమ్మరం చేయాలని, జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా ఉండేలా చూడాలని సంబంధిత లైన్ విభాగాలను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా మార్చడానికి జూన్ 30 వరకు బాల కార్మికుల గుర్తింపు, విడుదల, రక్షణ మరియు పునరావాసం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ మూడో తేదీన భీమవరం ఇండస్ట్రియల్ ఏరియా, 4వ తేదీన తణుకు, ఐదో తేదీన తాడేపల్లిగూడెం, ఆరో తేదీన పాలకొల్లు, పదో తేదీన నరసాపురం పట్టణ ప్రాంతాల్లో, 11వ తేదీన కాళ్ల మండలం కాళ్ళ , పెదమిరం, 12వ తేదీన భీమవరం రూరల్ మండలం, 13వ తేదీన పెనుగొండ, 17వ తేదీన ఆకివీడు, 18వ తేదీన కాళ్ళ ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్స్, 19 తేదీన గణపవరం, 20వ తేదీన అత్తిలి, ఇరగవరం, 21వ తేదీన పెంటపాడు, 24వ తేదీన పెనుమంట్ర, మార్టేరు, 25వ తేదీన పాలకోడేరు, 26వ తేదీన మొగల్తూరు, 27వ తేదీన వీరవాసరం మరియు భీమవరం రూరల్ ప్రాంతాలలో బాల కార్మిక వ్యవస్థ చట్టాలు, శిక్షలు, అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణ, డీఈవో ఇ.నారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి వి ఎస్ బి ఆర్ రాజు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గీతా బాయి, ఎస్ ఎస్ ఏ ఏపీసి పి.శ్యాంసుందర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు