పశ్చిమగోదావరి జిల్లాలో యూరియా కొరత లేకుండా తీసుకున్న చర్యలు అభినందనీయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఎరువులు కొరత లేని జిల్లాలలో పశ్చిమగోదావరి జిల్లా తొలి స్థానంలో ఉంది..
జిల్లాలో ఎరువులు కొరత లేదు, రైతులు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు..
ఉద్దేశపూర్వకంగా ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయి
–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గత బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు పశ్చిమగోదావరి జిల్లాలో ఎరువులు కొరత లేకుండా ముందస్తుగా తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని అభినందించారు. తొలుత ముఖ్యమంత్రి ఐవిఆర్ఎస్ ద్వారా సమీకరించిన సమాచారాన్ని జిల్లాల వారీగా ప్రస్తావిస్తూ .. మీ జిల్లాలో యూరియా లభ్యం అవుతుందా? అనే ప్రశ్నకు పశ్చిమగోదావరి జిల్లాలో 82 శాతం రైతులు అవును అని, యూరియా తగినంతగా సకాలంలో అందిందా? అనే ప్రశ్నకు 78%, అసలు యూరియా దొరకలేదు? అనే ప్రశ్నకు కేవలం 3.5 శాతం సమాధాన రావడం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎరువులు కొరతను అధికమించడానికి పశ్చిమగోదావరి జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో ఎరువులు కొరతను అధిగమించడానికి తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ వ్యవసాయ శాఖ ద్వారా అంచనాలను రూపొందించడం జరిగిందని, ఖరీఫ్ సీజన్లో సుమారు ఎంత మేరకు పంట సాగు చేయడం జరుగుతుంది, ఎంత ఎరువులు అవసరం అవుతాయి, గత సంవత్సరాల్లో ఎంత ఎరువుల వినియోగం జరిగింది, తదితర అంశాలను క్రోడీకరించి ముందస్తుగా ఎరువుల అంచనాలను సిద్ధం చేసుకుని ఇండెంట్ ను పంపడం జరిగిందని, దీని కారణంగా నేడు పశ్చిమగోదావరి జిల్లాలో ఎరువులు కొరతను నూరు శాతం అధిగమించడం జరిగిందని తెలిపారు.