పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు.

Publish Date : 04/11/2026
WhatsApp Image 2026-11-04 at 4.55.46 PM

 

బుధవారం భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు, 340 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం సుమారు 7,500 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 5వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఓటర్లందరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.