పశ్చిమగోదావరి జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఇప్పటివరకు వున్న సారా తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవోదయం 2.0 (నాటుసారా నిర్మూలన) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ డిసి బి.శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం సారా రహిత రాష్ట్రంగా మార్చాలని నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించి లక్ష్యాన్ని నిర్ధేశించిందన్నారు. మన జిల్లాలో సారా తయారీ పూర్తిగా నిర్మూలించడం జరిగిందని వెల్లడించారు. సారా తయారీ, విక్రయాలతో జీవనం సాగించేవారు ఇకపై ఆపనులు మానుకొని, ప్రత్యామ్నాయంగా ఉపాధి పొందేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను తయారీదారుల భార్యల పేరున ఆర్థిక సహాయాన్ని సమకూర్చడం జరిగిందన్నారు. జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సారాయి తయారీ, విక్రయం ఉందని, దానిని పూర్తిగా నిర్మూలించే దిశగా 13 మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.ఒక లక్ష చొప్పున చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. దీనితో పశ్చిమగోదావరి జిల్లాను సారాయి రహిత జిల్లాగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు. సారా తయారీకి సంబంధించిన సమాచారాన్ని 14405 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయవచ్చని, సంబంధిత టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. మద్యపాన అనర్ధాలపై అవగాహన కలిగించేందుకు ర్యాలీలు నిర్వహించాలన్నారు. నాటుసారా తయారుచేసినా, విక్రయించినా చట్టరీత్యా నేరమన్నారు. సారాయి తయారీకి ఉపయోగించే ముడిపదార్ధాలు విక్రయించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సారా తయారీ, రవాణా, విక్రయాలు కొనసాగించేవారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని, తొలుత తహశీల్ధారు వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు. తర్వాత ఏడాది పాటు బెయిల్ రాకుండా పిడి యాక్ట్ నమోదు అవుతుందన్నారు. ఎక్కడైనా నాటుసారా తయారుచేసినా, రవాణా చేసినా, నిల్వచేసినా, అమ్మకాలు జరిపినా 14405 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత మాట్లాడుతూ జిల్లాలో సారాయి వృత్తిలో ఉన్న వారిని గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో సారాయి ఉనికి కలిగి ఉందని గుర్తించబడిన 5 గ్రామాల్లో ఇప్పటికే గ్రామాల్లో నాటు సారాయి నిర్మూలించడం జరిగిందన్నారు.
చివరిగా 13 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల రూపాయల నమూనా చెక్కును అందజేయడం జరిగింది.
జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్ కుమరేశ్వరన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, సిఐ లు, తదితరులు పాల్గొన్నారు.