Close

పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ ఉచిత టీకా కార్యక్రమము సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 13/09/2025

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలు కార్యక్రమం అవగాహన గోడ పత్రికను శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 15వ తేదీ నుండి అక్టోబర్ 14 వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచితముగా టీకాలు వేయు కార్యక్రమమును జిల్లా లోని పశువుల యజమానులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పశు సంవర్ధక శాఖ సిబ్బంది ప్రతి గ్రామంలోను నాలుగు నెలలు దాటిన ప్రతి పశువుకు ఉచిత టీకాలను వేయడం జరుగుతుందని అన్నారు. పశువుల యజమానులు ఆవు జాతి మరియు గేదే జాతి పశువులకు ఉచిత టీకాలను వేయించి గాలికుంటు వ్యాధి రాకుండా తమ పశువులను కాపాడుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.మురళీకృష్ణ మాట్లాడుతూ పశువులలో గాలికుంటు వ్యాధి వచ్చినచో పాల ఉత్పత్తి మరియు పని సామర్ధ్యం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. వ్యాధి సోకిన పశువుల పాలు త్రాగినచో లేగ దూడలలో మరణాలు సంభవిస్తాయన్నారు. తీవ్రమైన జ్వరం, నీరసం, నోటి నుండి సొంగ కారుట, నోరు మరియు కాళ్ల గిట్టలు పుండ్లు, చూడి పశువులు ఈసుకుపోవటం, కొద్దిపాటి ఎండకు రొప్పడం జరుగుతుందని అన్నారు. వైద్యం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోవడం జరుగుతుందని పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలని అన్నారు. గాలికుంటు వ్యాధి టీకాలు వేయించటం వలన పశువులలో పాల సామర్థ్యం తగ్గకుండా, చూడి పశువులు ఇసుకపోవటం వంటివి నివారించవచ్చునని అన్నారు. లేగ దూడలలో మరణాల సంఖ్య తగ్గించి ఆరోగ్యంగా ఎదగటానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.ఎం.మురళీకృష్ణతో పాటు వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, సిపివో కె.శ్రీనివాస్ రావు, తదితరులు ఉన్నారు.