పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు మంచి బాటలు వేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేస్తున్న సీడ్ బాల్స్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేసి వారిని ప్రోత్సహించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ “మీలో ఎంతమందికి మొక్కలు నాటడం ఇష్టం?”, “మీరు తిన్న స్నాక్స్ ప్యాకెట్లను డస్ట్‌బిన్‌లో వేస్తున్నారా?”, “వ్యవసాయ పనుల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా?” వంటి ప్రశ్నలు అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పేడ, బూడిద, ఎర్రమట్టి, నల్లమట్టి మిశ్రమంతో తయారు చేస్తున్న సీడ్ బాల్స్‌లో బట్టగణప, వేగిస, సీమచింత, నల్లమద్ది, నెమలినార, జిట్రేగి, గుమ్మడి టేకు, మహాగని, చింత, నల్లజీడి, గానుగ, రేలా తదితర విత్తనాలను వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మొక్కలు ప్రాణవాయువును అందించడమే కాకుండా అనేక వస్తువుల తయారీలో మూల పదార్థాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి విరివిగా మొక్కలు నాటడం అత్యవసరమన్నారు. పర్యావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రతి ఇంటిలో పెరటి తోటలు, మిద్దె తోటలు ఏర్పాటు చేయాలని, స్కూల్ నర్సరీస్ పెంచాలని, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వనాలను అభివృద్ధి చేయాలని సూచించారు. జిల్లాలో రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తయారు చేసిన సీడ్ బాల్స్‌ను జిల్లా వ్యాప్తంగా అనుకూల ప్రదేశాల్లో వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఒక రోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఆశాకిరణ్, రేంజ్ ఆఫీసర్ ఎం.కరుణాకర్, ఎఫ్బిఓ కె.రాంప్రసాద్, భీమవరం నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారికి ఏ.అప్పారావు, ఎల్డిఎం ఏ.నాగేంద్ర ప్రసాద్, విష్ణు కాలేజీ స్టూడెంట్స్ ఎఫైర్స్ డైరెక్టర్ పి.శ్రీనివాసరాజు, కోఆర్డినేటర్ ఎం.రమేష్ కుమార్ స్పేస్ ఎన్వైరోన్మెంట్ ఎన్జీవో ప్రతినిధులు గోపిశెట్టి మురళీకృష్ణ, మేఘన, నెక్స్ట్ ఎన్జీవో ప్రతినిధులు స్వాతి, మనీష్, విష్ణు కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

