Close

పదవతరగతి పరీక్షా ఫలితాలు మంచి మార్కులతో నూటికినూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి…

Publish Date : 01/02/2025

ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులపై దృష్టి పెట్టాలి, విద్యార్థిని, విద్యార్థులు ఇష్టపడి చదవాలి.

జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి …

శనివారం కాళ్ళ మండలం కాళ్ళ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్షల కొరకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో పదవతరగతి పరీక్షలకు ఎంతమంది హాజరవుతున్నారు, రోజుకు ఎంత సమయం తీసుకుంటున్నారు, విద్యార్థులంతా హాజరవుతున్నారా, ఉపాధ్యాయులంతా హాజరవుతున్నారా తదితర విషయాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ మార్చి 17వ తేదీన నుండి జరగనున్న పదవతరగతి పరీక్ష ఫలితాలు నూటికినూరుశాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు మన పశ్చిమగోదావరి జిల్లాను రాష్ట్రంలోని ప్రథమ స్థానం నిలిచేలా సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు ఉత్తీర్ణత శాతాన్ని అనుసరించి, ప్రత్యేక తరగతులు ద్వారా విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. తూతూ మంత్రంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు రావని, ఇష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. సి,డి గ్రేడు పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే మరో అరగంట సేపు ఎక్కువగా ప్రత్యేక క్లాసులో ఉంచాలని అన్నారు. విద్యార్థులకు దైవం, తల్లి, తండ్రి అన్ని గురువేనని ఉపాధ్యాయ వృత్తికే మంచి సదవకాశం కలిగిందన్నారు. ఉపాధ్యాయులు స్వంత పిల్లలకు ఎంత శ్రద్ధ తీసుకుంటారో, ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల మీద అంతే శ్రద్ధ చూపించాలన్నారు.ఆడపిల్లల రక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆడపిల్లనుండి ఏటువంటి చిన్న ఫిర్యాదు వచ్చినా వెను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యార్థులలో పరీక్షలు భయాన్ని తగ్గించడానికి,అన్ని సబ్జెక్టులపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి తెలిపారు.

వసతి గృహాల విద్యార్థులు బాగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు.

కాళ్ళ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాన్ని మొత్తం అణువణువునా పరిశీలించి వసతి గృహాధికారికి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో జిల్లా కలెక్టరు మమేకమయ్యారు. ఈరోజు ఉదయం ఏమి టిఫిన్ పెట్టారని అడగగా, ఈరోజు ఇడ్లీ పెట్టారని విద్యార్థులు చెప్పడంతో జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం పంపిన దోమతెరలు ఉపయోగించు కుంటున్నారా, ఏలా పనిచేస్తున్నాయని విద్యార్థులను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. దోమతెరలు బాగా ఉపయోగపడుతున్నాయని, దోమలు బారిన పడకుండా మంచి మనసుతో మాకు పంపించినందుకు జిల్లా కలెక్టరుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియ జేయడంతో జిల్లా కలెక్టరు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. అనవసరమైన వ్యాపకాలను పక్కనపెట్టి, ఎక్కువ సమయాన్ని చదువుపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తే అది తిరిగిరాదని, కాలం చాలా విలువైనదని మీ భవిష్యత్తుకు చదువు ఒక రాజమార్గం అన్నారు. వసతి గృహాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్న తక్షణం తెలియజేయాలని, ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా సమకూర్చుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి భరోసా ఇవ్వడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

తనిఖీ సందర్భంలో హాస్టల్ వెల్ఫేరు ఆఫీసరు ఏ.శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు, తహాశీల్దారు జి.సుందర్ సింగు, డిఆర్డిఏ పిడి యం.యస్.యస్.వేణుగోపాల్, ఉపాధ్యాయులు, నాన్ టీచింగు సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు వున్నారు.