పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు రైతులు ముందుకు రావాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నరసాపురం మండలం చట్టవరం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన గ్రామ సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాలలో ఉన్న తప్పులు సరిచేసుకునేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. దీనికోసం సంబంధిత శాఖ అధికారులు నిర్వహిస్తున్న గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భూ వివరాలు, ఖాతా సంఖ్య, సర్వే నంబర్, విస్తీర్ణం, యజమాని పేరు, ఫోటో తదితర అంశాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలంటే పాసు పుస్తకాల వివరాలు ఖచ్చితంగా ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు. పాసు పుస్తకాలలో ఉన్న లోపాల వల్ల రైతులు పంట రుణాలు, రైతు భరోసా, బీమా వంటి ప్రయోజనాలు కోల్పోయే అవకాశముందని అన్నారు. రైతులు రెవెన్యూ క్లినిక్ కు వచ్చి భూ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఫిబ్రవరి నెలలో రైతులు ఏ తప్పులు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు పొందేందుకు ప్రతి ఒక్కరు మీ రికార్డులు సరిచూసుకోవాలని రైతులకు సూచించారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం గ్రామ సచివాలయాల్లో జరిగే పీజీఆర్ఎస్ ద్వారా కూడా అర్జీలను దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, తహసిల్దార్ ఐతం సత్యనారాయణ, ఆర్.ఐ సురేఖ, వీఆర్వోలు, వీఆర్ఏలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.