పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యాగారానికి, అన్నదానాలకు, ప్రేమా ఆప్యాయతలకు పుట్టినిల్లు అని జిల్లా పర్యటన గొప్ప అనుభూతిని కలిగించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.
పకృతి సేద్యం రైతులకు ఆదాయం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదం.
తక్కువ ఖర్చుతో రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
గిట్టుబాటు ధర పొందేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు మంచి సేవలు అందించాలి.
రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ …
బుధవారం ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సచివాలయాన్ని, మహాదేవపట్నం ఆర్.ఎస్.కె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. మహదేవపట్నంలో ఎన్టీఆర్ నగర్ లబ్ధిదారు కమ్మకట్ల కమలమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్.ఆర్.పి అగ్రహారం ప్రకృతి సేద్యం వ్యవసాయ ఉత్పత్తుల ఫోటో ఫ్లెక్సీ ప్రదర్శన తిలకించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ రైతులకు మేలైన లాభసాటి వరి వంగడాలను అందించడంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. పరిశోధనలను విస్తృతం చేసి రైతులకు మేలైన వరి, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ వంగడాలను అందించాలని అన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా పంట పొలాల్లో, ఉద్యానవన తోటల్లో నీళ్ళు నిలబడి పోవడం జరిగిందని, నీళ్లు తొలగిన అనంతరం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే మిల్లెట్ ల సాగు, అంతర పంటల సాగుపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ కు అనువైన మొక్కలను అందించాలన్నారు. పంటల సాగులో డ్రోన్ల వినియోగం పెరగాలని, పురుగుమందులు వాడకాన్ని బాగా తగ్గించాలన్నారు. డ్రోన్ లు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రేయింగు చేయడంతో పాటు, పురుగు మందులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. డ్రోన్లు వినియోగంపై రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎన్ ఆర్ పి అగ్రహారం, పెదపుల్లేరు గ్రామాలలో సేంద్రియ వ్యవసాయం ద్వారా నవధాన్యాలు, కూరగాయలను పండించుట శుభ పరిణామం అన్నారు. భీమవరం కలెక్టరు కార్యాలయంలో ప్రతి సోమవారం సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన నవధాన్యాలు, విత్తనాలు, కూరగాయలు అమ్ముకుంటున్నామని రైతులు చెప్పటం నాకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చాలా బాగున్నదని అన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొంది ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ధాన్యం కొనుగోలు అయిన 24 గంటల వ్యవధిలో బ్యాంకులు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. గోనె సంచులు సరఫరాలో ఏటువంటి ఇబ్బందులు లేవని ఇంత త్వరగా డబ్బులు ఎకౌంట్లో జమ కావడం ఇంతకు ముందు ఎన్నడూలేదని అన్నారు. సకాలంలో డబ్బులు పడితే రైతులకు ఆర్థిక భారం కూడా పడదని, లేకపోతే గతంలో డబ్బులు పడేలోపు వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి ఉండేదని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించి ప్రజలు మన్ననలు పొందాలన్నారు. వాట్సప్ గవర్నర్స్ పై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ, కుటుంబ సభ్యులు చేర్పులు, తొలగింపు, ఆధార్ నమోదు, తదితర విషయాలలో ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా నాణ్యమైన సేవలు అందించాలని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, సివిల్ సప్లై జిల్లా మేనేజరు టి.శివరామ ప్రసాదు, జిల్లా టూరిజం అధికారి ఏ.వి. అప్పారావు, ఇంచార్చి హౌసింగు పిడి జి.పిచ్చియ్య, డియల్డివో వై.దోసిరెడ్డి, గృహ నిర్మాణశాఖ ఇఇ బి.వెంకటరమణ, డిపియం నూకరాజు, వ్యవసాయ శాఖ ఎడిఏ శ్రీనివాసరావు, మండల వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది, సేంద్రియ వ్యవసాయ రైతులు, తదితరులు పాల్గొన్నారు.