నేర పరిశోధన దర్యాప్తు రంగంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కి జాతీయస్థాయి అవార్డు–ప్రత్యేకంగా అభినందించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నేర పరిశోధన దర్యాప్తు రంగంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కి జాతీయస్థాయి అవార్డు వచ్చినందుకు పూల మొక్కను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేక ఆపరేషన్, దర్యాప్తు మరియు ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో 2025 సంవత్సరానికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా “కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్” అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాకు మాత్రమే దర్యాప్తు రంగంలో అవార్డులను గెలుచుకోవడం జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా దర్యాప్తు రంగంలో అవార్డులకు ఎంపికైన వారిలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పి వి.భీమారావు, డి.ఎస్.పి ఆర్.జి జయ సూర్య, ఎస్ఐ ఎండి నసిరుల్లా ఉన్నారు. ఉండి మండలంలోని యండగండి గ్రామంలో సంచలనాత్మక కేసుకు సంబంధించిన దర్యాప్తు సందర్భంగా ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. తులసి అనే మహిళ మృతదేహాన్ని పార్శిల్ రూపంలో అందుకోవడం, దిగ్భ్రాంతికరమైన సంఘటన దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి నేతృత్వంలో పశ్చిమ గోదావరి పోలీసులు అత్యంత ప్రొఫెషనల్ దర్యాప్తును నిర్వహించి కేసును విజయవంతంగా ఛేదించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి స్పెషల్ ఆపరేషన్ అవార్డును అక్టోబర్ 31న పశ్చిమ గోదావరి పోలీసు అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి పోలీసులకు లభించిన ఈ జాతీయ గుర్తింపు భవిష్యత్తులో మరింత గొప్ప సేవ మరియు శ్రేష్ఠతకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.