Close

నెలకు రూ.4 వేలు పింఛన్ పొందడం ద్వారా గౌరవంగా బ్రతక గలుగుతున్నాం..

Publish Date : 01/10/2025

పిల్లలు పట్టించుకోకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు పెద్ద మొత్తంలో పెన్షన్ అందించి అండగా నిలుస్తున్నారు.. పింఛను అందుకుంటూ కన్నీటి పర్యంతమైన వృద్ధుడు…

తినడానికి, మందులకు లోటు లేకుండా ఉంది.. రాష్ట్ర ముఖ్యమంత్రికి నా వందనాలు

ఆర్థిక ఆసరాగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు నిలుస్తున్నాయని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

బుధవారం భీమవరం ఆదర్శనగర్ కాట్రేగుంటలో డిఆర్డిఏ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. ఉదయాన్నే కాట్రేయగుంటకు చేరుకున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీధులన్నీ కలియతిరిగి లబ్ధిదారులను పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షన్లు పంపిణీ సందర్భంలో లబ్ధిదారులు ఆరోగ్య వివరాలు, ఏం పని చేస్తున్నారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ సందర్భంలో పెన్షన్ అందుకుంటూ ఒక వృద్ధుడు కన్నీటి పర్యంతం అవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పలుమార్లు డబ్బులను కళ్ళకి హద్దుకుంటూ పిల్లలు పట్టించుకోకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు పెద్ద మొత్తంలో పెన్షన్ అందించి అండగా నిలుస్తున్నారని, నెలకు రూ.4 వేలు పింఛన్ పొందడం ద్వారా గౌరవంగా బ్రతక గలుగుతున్నాం అన్నారు. తినడానికి, మందులకు లోటు లేకుండా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రికి నా వందనాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో పింఛన్లు అందజేస్తుందని లబ్ధిదారులు ఉన్నంతలో కొంత దాచుకొని ఆర్థికంగా స్థిరంగా ఉండాలన్నారు. మహిళల ఆరోగ్యం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని దీనిలో భాగంగా “స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్” పేరిట వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలు, ఆడ పిల్లలకు అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వస్తువులపై విధించే జిఎస్టి స్లాబులను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్నదని, దీనివలన అన్ని వర్గాల ప్రజలకు ప్రతినెలా రూ.2,500/- నుండి రూ.5 వేల వరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. వైద్య రంగానికి జీఎస్టీ తగ్గింపు ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరిందని, కొన్ని రకాల మందులకు జీఎస్టీ నుండి పూర్తి వెసులుబాటు కల్పించిందన్నారు. ఇటువంటి సేవలు అన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని అవగాహన కల్పించారు. నేడు జిల్లా వ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,26,127 మంది లబ్ధిదారులకు రూ.97,40,46,500 పింఛన్లు మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుచున్నదని వెల్లడించారు.

పింఛన్లను పంపిణీ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఏ పీ ఓ ఎం శ్రీనివాస్ ప్రసాద్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ బి.రాంబాబు, డిఆర్డిఏ, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, స్థానిక జె.ఎస్.పి నాయకుడు కొప్పినీడు బాబి, తదితరులు పాల్గొన్నారు.