నెగ్గిపూడిలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ
సైకిల్ ర్యాలీతో పర్యావరణ పరిరక్షణ సందేశం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలగలేరు సొసైటీ నుంచి మార్టేరు శ్రీ వేణుగోపాల ఆడిటోరియం వరకు ప్రత్యేక సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ ద్వారా “పర్యావరణాన్ని కాపాడుకుందాం – కాలుష్యాన్ని తగ్గిద్దాం” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు.
అనంతరం నెగ్గిపూడి గ్రామంలోని శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కే.సి.హెచ్ అప్పారావు తదితరులు పాల్గొని పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లు వాతావరణ మార్పులను తగ్గించడంలో, భూగర్భ జలాల సంరక్షణలో, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను పెంచే అలవాటు చేసుకోవాలని సూచించారు.
శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా వారంలో ఒక రోజు సైకిల్ లేదా పర్యావరణ హిత వాహనాలను వినియోగించాలని ప్రజలకు సూచిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే నేడు సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇంధన పొదుపు అత్యంత ముఖ్యమైన అంశమని, ప్రతి చిన్న పనికి మోటార్ వాహనాల వినియోగం పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం అధికమవుతోందన్నారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రజలు సాధ్యమైనంత వరకు చిన్న చిన్న దూరాలకు సైకిళ్లను వినియోగించాలని సూచించారు.
పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ప్రోత్సహించారు. పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని సంకల్పించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు స్థానికంగా విశేష ఆదరణ పొందాయి.