నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి.
పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలి.
కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్న, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని సాధ్యమైనంత వరకు నూతన పారిశ్రామికవేత్తలు సంబంధిత భూ యజమానుల భాగస్వామ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉండి గ్రామానికి చెందిన అశోక్ డిహైడ్రేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి జిల్లా కలెక్టర్ కు వివరించారు. భీమవరానికి చెందిన యువ పారిశ్రామికవేత్త కె.టి ఎన్ సత్యనారాయణ బయో డీగ్రెడబుల్ ప్రొడక్ట్స్ హస్క్ నుండి పేపర్ ప్లేట్లు సింగల్ యూజ్డు, రీ యూజబుల్ ఉత్పత్తులపై వివరించారు. రైస్ మిల్లింగ్ ద్వారా వచ్చే పొట్టు నుండి సిలికాన్ ఉత్పత్తిపై భీమవరానికి చెందిన కృష్ణ తమ ప్రాజెక్టు గురించి జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతూ ముడి సరుకు లభ్యత, టెక్నాలజీ వినియోగం, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా యంత్రాంగం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం రైస్ మిల్లులు ఎక్కువ విస్తీర్ణంలో నిర్వహించబడుతున్నాయని, ఖాళీగా ఉన్న భూమిని వినియోగించుకొని రైస్ ఆధారిత ఉప ఉత్పత్తుల యూనిట్ల స్థాపనకు ఆలోచన చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఎన్ ఆర్ డి సి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే యువ పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీ, మిషనరీ, ముడి సరుకు లభ్యత, మార్కెటింగ్, బ్యాంకు రుణాలు, వివిధ అనుమతులు పై అవగాహన కల్పించేందుకు మార్చి నెలలో వర్క్ షాప్ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉండి, ఆకివీడులలో ఉన్న పార్కులకు అనుబంధంగా ఉన్న చెరువుల నందు పిల్లలను, పెద్దలను ఆకర్షించే విధంగా బోటింగ్ సదుపాయాన్ని కల్పించాలని జిల్లా టూరిజం అధికారిని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్షిస్తూ డిసెంబర్ 24వ తేదీ నుండి ఇప్పటివరకు వివిధ శాఖల అనుమతుల కోసం 1,335 ధరఖాస్తులు రాగా 1,338 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, మరో 16 ధరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. పిఎంఈజీపి పథకం 2025-26 కింద యూనిట్ల స్థాపన మంజూరు కొరకు 333 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని, 318 యూనిట్లు స్థాపించడం జరిగిందని, బ్యాంకుల వద్ద పెండింగ్ లో 164 దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి
యు.మంగపతి రావు, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏవి అప్పారావు, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్వాతి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, చేనేత శాఖ అధికారి కె.అప్పారావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.అరుణ కుమారి, జిల్లా రవాణా శాఖ అధికారి కె.కృష్ణారావు, యూనియన్ బ్యాంక్ ప్రతినిధి పి.ప్రేమ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇన్వెస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.