నియోజవర్గాల వారి అభివృద్ధి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ – 2047 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యంగా మన జిల్లా వ్యవసాయ ఆధారిత పంటలపై ఆధారపడి ఉందని, జిల్లాలో వరి సాగు 4.25 లక్షల ఎకరాల్లో చేపట్టడం జరిగిందని, దీని ద్వారా 15 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. దీనిలో 10 లక్షల మెట్రిక్ టన్నులను ధాన్యం సేకరణ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో 16% మాత్రమే పరిశ్రమల భాగస్వామ్యం ఉందని, పరిశ్రమల రంగాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరితోపాటు అంతర పంటలను వేసుకోవడం, ఉద్యానవన పంటల సాగును హితోదికంగా పెంచుకోవడం చేయాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగులో హై వ్యాల్యూ ప్రొడక్ట్స్ ను సాగు చేయాలన్నారు. ఉన్న పరిశ్రమలలో ఉత్పాదకతను పెంచాలన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధికి స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర పై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో చెత్తను వేయడం మాని పరిశుభ్రతను పెంపొందించేలా ప్రజలు వ్యవహరించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టిని సాధించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, నీటి వనరులలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఇతర వ్యర్ధాలు కలవడం కారణంగా నీరు, గాలి ఎంతో కలుషితమవుతున్నాయని, వీటిని మూగజీవాల నీటిని తాగడం, ప్లాస్టిక్ ను కారణంగా అనారోగ్యం పాలవుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశుభ్రతగా ఉండటంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా బాధ్యతగా ముందుకు నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీఎం సూర్యఘర్ ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని, నియోజకవర్గానికి 10వేల యూనిట్ల స్థాపన లక్ష్యంగా నిర్ణయించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభ్యులకు బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. పీఎం సూర్యఘర్ సోలార్ విద్యుత్ ఏర్పాటుకు త్వరలో ఎస్సీ లబ్ధిదారులకు ఉచితంగాను, బీసీలకు సబ్సిడీతో పాటు అదనంగా మరో 20 వేలు లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని తెలిపారు. జిల్లాలో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారని, డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి ఒక్కరు పాఠశాలలో చదువుకునేలా అందరూ బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. జీరో పావర్టీ – P4 (పబ్లిక్- ప్రైవేట్- పీపుల్ పార్టనర్‌షిప్) లో భాగంగా ప్రభుత్వం సమాజంలో ఆర్థికంగా సంపన్నమైన వారు పేద కుటుంబాలను ఆదుకోవడానికి మద్దతు ఇవ్వడానికి మరియు మార్గదర్శకత్వం చేయడం ద్వారా వారిని పేదరికం నుండి పైకి తీసుకురావడానికి మార్గాలను సృష్టిస్తోందన్నారు. తద్వారా వారు సమాజంలో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఈ పి-4 కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర @ 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రజలు ఆర్థిక అభివృద్ధికి చురుకైన సహకారులుగా మరియు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉండేలా చూసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జీరో పావర్టీ-P4 ను రూపొందించిందన్నారు. పేద కుటుంబాలకు మార్గదర్శకత్వం, మద్దతు ఇవ్వడానికి సంపన్నులు ప్రోత్సహించడం ద్వారా సామాజిక – ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఈ చొరవ ఎంతగానో దోహద పడుతుందన్నారు. అంతేగాక సమ్మిళిత మరియు స్థిరమైన వృద్ధి సాధనకు ఉపకరిస్తుందన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆరోగ్యకరమైన ఆనందమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం విజన్ డాక్యుమెంట్ రూపొందించిందన్నారు. గ్రామాల్లో ఏ విధంగా పని చేయాలి, ప్రజల వ్యక్తిగత అవసరాలకు పి-ఫోర్ ని ప్రవేశపెట్టి పేదరిక నిర్మూలనకు చేయూతనివ్వడం జరుగుచున్నదన్నారు. నియోజకవర్గంలో బలము, బలహీనతలు ఎలా ఉన్నాయి, ఆదాయ వనరులు ఎలా సాధించాలి, తలసరి ఆదాయాన్ని ఎలా పెంచాలి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి ఎలా చేయాలి అనే దానిపై రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజన్ డాక్యుమెంటును అభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం ప్రజలు, సంపన్నులు భాగస్వామ్యంతో పి -ఫోర్ లక్ష్యాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, నియోజవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్, తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, టిడిపి టౌన్ ప్రెసిడెంట్ కె వెంకట కృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.