నిమోనియా నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
నిమోనియా నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
2026 నవంబరు 12వ తేదీ నుంచి 2027 ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించనున్న నిమోనియా నివారణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను గురువారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాట్లాడుతూ నిమోనియా నివారణతో బాల్యానికి భరోసా కల్పించవచ్చని అన్నారు. చిన్నపిల్లలను నిమోనియా బారిన పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శిశువు జన్మించినప్పటి నుంచి ఆరు నెలల వయస్సు పూర్తయ్యే వరకు తల్లిపాలను మాత్రమే అందించాలని, ఆరు నెలల అనంతరం తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు.
పిల్లలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని, ఇంటి పరిసరాల్లో మరియు గృహాల లోపల పొగ, దుమ్ము వంటి కాలుష్య కారకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచించారు. చలిగాలుల ప్రభావం నుంచి పిల్లలను రక్షించేందుకు తగిన వెచ్చని దుస్తులు ధరింపజేయాలని తెలిపారు.
నిమోనియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.