నరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు ఒన్ డిస్ట్రిక్ట్…ఒన్ ప్రొడక్ట్ క్రింద ఎంపిక
నేడు (సోమవారం) ఢిల్లీలో అవార్డును అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ఇప్పటికే దేశవిదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన నరసాపురం లేస్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వముచే అమలు చేయబడుచున్న ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డు పదకము క్రింద 2024-25 సం॥కు గాను నరసాపురం లేసు అల్లికు ఎంపిక కాబడినది. 2024-25 సం||కుగాను మన రాష్ట్రము నుండి 26 జిల్లాల ఉత్పత్తులను పోటీలో ఉంచగా కేంద్రప్రభుత్వ ప్రతినిదుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరము 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక కాగా, మన నరసాపురంకు చెందిన లేసు అల్లికలు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని అందుకొనేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఢిల్లీ వెళ్లారు. కొత్తఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఓడిఓపి అవార్డును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రివర్యులు చేతుల మీదుగా జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి స్వీకరించబోతున్నారు.
నరసాపురం లేసుకు అంతర్జాతీయ గుర్తింపు
నరసాపురం లేసుకు దేశవిదేశాల్లో ఎనలేని ఖ్యాతి ఉంది. పశ్చిమగోదావరి జిల్లాకు ఎవరు వచ్చిన నరసాపురం లేసు పార్కును సందర్శించి లేసు ఉత్పత్తులను కొనకొండా వెళ్లడం ఉండదు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సుల్లో సైతం లేసు ఉత్పత్తుల అలంకరణ కనపడుతుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు లేసు అల్లికలు ఆన్లైన్ ప్లాట్ ఫారం ద్వారా ఎగుమతి అవుతున్నాయి. లేసు అల్లికలకు గత కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోలిక గుర్తింపు కూడా లభించింది. ఈ అవార్డును కూడా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందుకోవడం జరిగింది. నరసాపురం లేస్ పార్క్ తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లేసు అల్లికలు సంవత్సరాలుగా ప్రసిద్ధిగాంచాయి. ఇటీవల కొంత మార్కెటింగ్ లో వెనుకబడి ఉత్పత్తులు తగ్గిన తరుణంలో జిల్లా కలెక్టర్ గా చదలవాడ నాగరాణి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి లేస్ పార్క్ పై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ లేసు ఉత్పత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. వీటికి ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించడంలో బలం చేకూరింది. తరచు లేస్ పార్క్ ను సందర్శిస్తూ వారి తయారు చేస్తున్న వివిధ డిజైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి అల్లికదారులకు తగు సూచనలను అందజేయడంతో అల్లికదారులు నూతన ఉత్సాహంతో వినూత్నమైన డిజైన్లను రూపొందించి ప్రదర్శించడం జరుగుతుంది. తద్వారా లేస్ ఉత్పత్తులకు పూర్వ వైభవం కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. మన జిల్లా కలెక్టర్ మార్గదర్శకంలో జిల్లా అన్నింట ముందుంటూ ఇటీవల కాలంలో పలు రాష్ట్ర, కేంద్ర అవార్డులను సొంతం చేసుకోవడం జిల్లాకు ఎంతో గర్వకారణం.