Close

నరసాపురం ప్రాంత ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో చైతన్యవంతులు కావాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెత్త నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

Publish Date : 04/04/2025

శుక్రవారం నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన “పరిశుభ్ర నరసాపురం” కు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు, శానిటరీ వర్కర్స్ తో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నరసాపురం డంపింగ్ పెద్ద సమస్యగా మారిందని, గోదావరి నది ఒడ్డున డంపింగ్ చేయడంతో భూమి, వాయు, నీరు కాలుష్యం అవుతున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిశీలించి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ చర్యలకు పూనుకున్న సందర్భంలో, కొంత సమయాన్ని అడిగి తాత్కాలికంగా చర్యలను నిలుపుదల చేసుకోవడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు, పెద్ద ఎత్తున చెత్త గోదావరి ఒడ్డున డంపింగ్ చేయడం వలన గోదావరి పెరిగితే నదిలో కలిసిపోవడం, లేనిపక్షంలో పట్టణాన్ని ముంచెత్తడం జరుగుతాయని ఇవి పెద్ద అనారోగ్యకరమైన అనార్థాలకు దారితీస్తాయన్నారు. చెత్త వ్యర్ధాలు నీటిలో కలవడం కలిసిన నీరు తాగడం, ఆ నీటితో పండించిన కూరగాయలు, పళ్ళు విషంపూరితమై అనారోగ్యం చేకూరుస్తున్నాయన్నారు. అంతేకాకుండా క్యాన్సర్, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి వ్యాధులకు గురి అవుతున్నారని వివిధ పరిశోధనలలో తేలిందన్నారు. అలాగే పశువులు డంపింగ్ చేసిన ప్రాంతంలో తినడం వలన చెత్తలో ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, బ్లేడ్లు, ఇనుప వస్తువులు తదితర పదార్థాలు జంతువులకు పెద్ద హాని చేస్తున్నాయని అలాగే వాటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. విధినిర్వహణలో ఉత్తమంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులు గృహస్థులకు మరింత అవగాహన కల్పించి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగాని ఇస్తేనే సేకరించాలని ఆదేశించారు. పొడి చెత్తను ప్రతిరోజు సేకరించకపోయిన రెండు రోజులు ఒకసారి సేకరించాలని సూచించారు. ప్రతి పని కార్యరూపం దాల్చినప్పుడే ఫలితాలను పొందగలమని అన్నారు. నరసాపురం డంపింగ్ యార్డ్ లో పాత వేస్ట్ ను మిషన్ ద్వారా గ్రైండింగ్ చేసి కంపోస్ట్ గా తయారు చేయడం జరుగుచున్నదని, దీనికి అదనంగా రోజురోజుకు పెద్ద మొత్తంలో చెత్త పోగు పడటం ఇబ్బందికరంగా ఉందని బాధను వ్యక్తం చేశారు. నరసాపురం ప్రజలు చైతన్యవంతులు కావాలని, నరసాపురానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని, దీనిని చేజేతులా నాశనం చేసుకోరాదని హితవు పలికారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అందరు సహాయ సహకారాలతో మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చెత్త రహిత నరసాపురంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు. హోటల్స్, హాస్టల్స్, షాపింగ్ మాల్స్, కళ్యాణ మండపాలు తదితర వాటి నుండి 50 కేజీలకు మించి వచ్చిన చెత్తను ఎట్టి పరిస్థితుల్లో సేకరించరాదని, ఈ విషయమై కౌన్సిల్లో కూడా తీర్మానం చేయాలన్నారు. 50 కేజీలు లోపు చెత్తను పొడి చెత్త, తడి చెత్తగా వేరు చేసి ఇస్తే మాత్రమే సేకరించాలని ఆదేశించారు. 50 కేజీల పైన చెత్తను జనరేట్ చేస్తే వారే సొంతంగా ఫిట్స్ ను ఏర్పాటుసి కంపోస్ట్ చేసుకోవాలని తెలియజేయాలన్నారు. ఒకరికి సాధ్యం కాకపోతే ఇద్దరు, ముగ్గురు కలిసి కూడా ఏర్పాటు చేసుకోనెలా వారికి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు.

నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త వారి ఇంటిలోనే వేరు చేసే ఇచ్చేలా ప్రోత్సహించాలన్నారు. డంపింగ్ యార్డ్ కు అవసరమైన స్థల సేకరణలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలను అందించాలన్నారు. ప్రజా ప్రతినిధులుగా పరిశుభ్ర నరసాపురం గా రూపుదిద్దుచేందుకు మా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చెత్త రహిత నరసాపురంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను ముందుస్తుగా సిద్ధం చేయాలని సూచించారు. ప్రతిరోజు ఎంత చెత్తను సేకరిస్తున్నారు, ఎంత వేరు చేయాలి శానిటరీ సెక్రటరీలు ఇంటింటికి అవగాహన కల్పించాలన్నారు. ప్రజలలో అవగాహన రావాలని, గడువు దాటిన మార్పు రాకపోతే అపరాధ రుసుము కూడా విధించడం జరుగుతుందని తెలిపారు. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ తోనే 30 శాతం డంపింగ్ నిండిపోతుందని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పర్యవేక్షించేందుకు టీమ్స్ ను నియమించాలని సూచించారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు కంటికి కనిపించేంత పరిశుభ్రమైన నరసాపురంగా కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాలను, యూనిఫామ్ ను వెంటనే ఇవ్వాలని సూచించారు. చెత్తను కాల్చడం, రోడ్డు మీద వేయడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ మూడో శనివారం “ఈ వేస్ట్” థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఎలక్ట్రానిక్ వస్తువులను చెత్తలో కల్పరాదని, ప్రత్యేకంగా సేకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ , వైస్ చైర్ పర్సన్ కామన నాగిణి, కార్పొరేటర్లు బొమ్మిడి సూర్యకుమారి, తోట అరుణ, కోప్పాడ కృష్ణవేణి, ఎస్.మీరమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, శానిటరీ సెక్రటరీలు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.