నరసాపురం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ పునరుద్ధరణ పూర్తి. ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేసిన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ. యుద్ధ ప్రాతిపదికన సమన్వయంతో పనిచేసిన విద్యుత్ శాఖ, ఇతర శాఖల సిబ్బంది. జిల్లా కలెక్టర్ చదలవాడ

Publish Date : 31/10/2026
31_10

నరసాపురం పట్టణంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధం చేసిన పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
శనివారం నరసాపురం పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల ఏర్పడిన తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రజలకు, ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
నరసాపురం పురపాలక సంఘం పరిధిలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించి, సిద్ధం చేసిన పోలింగ్ కేంద్రాలలో దాదాపు అన్నింటికీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల ఈ మేరకు పురోగతి సాధ్యమైందని కలెక్టర్ వివరించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, ఇతర వ్యవస్థలను పునరుద్ధరించేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
నరసాపురం పట్టణంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా సాధ్యమైనంత మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి ప్రజలకు సాధారణ విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.