దీపం–2 పథకంలో నాలుగో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమ కాని లబ్ధిదారుల సాంకేతిక సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి దీపం–2 పథకంలో నాలుగో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమ కాని లబ్ధిదారుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో విడత సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమకావడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గొల్లలకోడేరు గ్రామంలోని పోస్టాఫీసుకు స్వయంగా వెళ్లి ఒక లబ్ధిదారుడి ఆధార్ నంబర్‌ను పోస్టాఫీస్ ఖాతాకు మ్యాపింగ్ చేయించారు. జిల్లాలో నాలుగో విడత సబ్సిడీ పొందని 98 మంది లబ్ధిదారుల జాబితాను సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు మరియు తహసీల్దార్లకు పంపినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే బ్యాంక్ అధికారులు వెళ్లి ఆధార్ మ్యాపింగ్ పూర్తి చేస్తారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అనంతరం గొల్లలకోడేరు గ్రామంలోని రేషన్ షాపులు నెం.0537029, 0537035లను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుల్లో నిత్యవసర సరుకుల నిల్వలు మరియు ఆన్లైన్ నమోదుల్లో ఎలాంటి తేడాలు ఉండకూడదని, కార్డుదారులకు నాణ్యమైన సరుకులు అందించాలని డీలర్లకు సూచించారు. 65 సంవత్సరాల పైబడిన కార్డుదారులకు ఇంటి వద్దకే సరుకులు అందజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సరోజ, ఏఎస్ఓ ఎన్.రవిశంకర్, సీఎస్డీటీ శేషయ్య, వీఆర్వో, తదితరులు పాల్గొన్నారు.