Close

దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, వారి హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 25/04/2025

శుక్రవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన దివ్యాంగుల హక్కుల చట్టం-2016 అనుబంధం మార్గదర్శకాలు -2023 అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు, అసోసియేషన్ల ప్రతినిధులతో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చట్టం అమలుపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చట్టం అవగాహనకు 15 రోజుల్లో జిల్లా అధికారులకు ఒక వర్క్ షాప్ ను నిర్వహించాలని డిఆర్ఓకు సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో దివ్యాంగుల చట్టం సెక్షన్ల – 92 అవగాహనపై సమాచారంతో గోడ పత్రికలను తయారు చేసి ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీకి సూచించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల చికిత్సకు ఎస్ఓపిని అనుసరించాలని సూచించారు. వారికి ఓపిలో ప్రాధాన్యత ఇవ్వాలని, ఇన్ పేషెంట్లకు ప్రత్యేక బెడ్ ను కేటాయించేలా అన్ని ప్రభుత్వాసుపత్రులకు ఉత్తర్వులను జారీ చేయాలని డిఎం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు. దంపతులు ఇద్దరు వికలాంగులైతే, లీగల్ గార్డెన్ ఆథరైజేషన్ కు చర్యలు తీసుకోవడానికి అట్టివారిలో అర్హులైన వారిని ఏఎన్ఎం, ఆశ వర్కర్లు గుర్తించి జాబితాను అందజేయాలన్నారు. దివ్యాంగ ఉద్యోగులు తాము చేయగలిగినంత పని చేయగలిగితే వారికి సముచిత గౌరవం లభిస్తుందని సూచనప్రాయంగా తెలిపారు. దివ్యాంగ ఉద్యోగులకు పదోన్నతులు సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు సమావేశంలో లేవనెత్తిన వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆయా శాఖాధికారులతో సమాధానాలను చెప్పించడం జరిగింది.

జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులు రాకపోకలకు వీలుగా ర్యాంపులు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిణకు కూడా చర్యలు తీసుకొనన్నుట్లు తెలిపారు.

జిల్లా అడిషనల్ ఎస్పీ యు.భీమారావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో దివ్యాంగుల చట్టం అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వారికి ఉన్న వికలాంగత్వాన్ని దూషిస్తే సెక్షన్ – 92 అమల్లో భాగంగా ఐదు సంవత్సరాల వరకు శిక్ష ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంలో వికలాంగత్వం గురించి మాట్లాడుతూ “సిరిసిరి మువ్వ” చిత్రంలోని సన్నివేశాన్ని ఉదాహరణగా వివరించారు.

జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యులు నండూరి రమేష్, జి.సంపతరావులు మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం 2016పై వివిధ శాఖ అధికారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో నిబద్ధత కొరవడిందన్నారు. చట్టంపై అవగాహన కలిగించడానికి మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తామని, ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు కొద్ది సమయం మాకు కూడా అవకాశం కల్పిస్తే అవగాహన కల్పిస్తామన్నారు. దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్ల జారీని సరళీకృతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జి.గీతాబాయి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ డిపిఓ బి. అరుణ శ్రీ,, డి సి హెచ్ ఎస్ పి
సూర్యనారాయణ, మెప్మా పీడీ బి.రజనీకాంత్, ఆర్ అండ్ బి ఎస్.ఇ ఎ.శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎస్
ఈ, కె శ్రీనివాస్, ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్, వినికిడి లోపం కలిగిన దివ్యాంగుల సంఘ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లాలో దివ్యాంగుల సేవలకు పాటు పడే స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.