దివ్యాంగుల కొరకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను శ్రద్ధ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

గురువారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపకారణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) సంస్థ దివ్యాంగుల కొరకు రెండు కోట్ల రూపాయలు అందివ్వడానికి ముందుకు వచ్చిందని, తొలి విడతగా 50 లక్షల ను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన ఉపకారణాలను జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించి రానున్న నెలలో క్యాంపు నిర్వహించి అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులకు ప్రతి ఏటా రెండు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు. అందిస్తున్న సౌకర్యాలను పిల్లలకు అందజేసే తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. దివ్యాంగులు అని తక్కువగా బాధపడవలసిన అవసరం లేదని, ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లల లోపాలను గుర్తిస్తే చికిత్స ద్వారా మెరుగుపరచడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమగ్ర విద్యా సేవలు అందించబడుతున్నాయన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా విద్యా, ఆరోగ్య, ఉపకరణాల పంపిణీ, క్రీడలు, మరియు స్కాలర్షిప్, అలవెన్సులు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ప్రైమరీ, సెకండరీ స్థాయిలో ప్రత్యేక బోధన అందించబడుతుంది. ఇందులో బాగంగా 38 మంది ఐఆర్పి, 22 మంది ఐ ఇ డి ఎస్ ఎస్ టీచర్లు ద్వారా ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మెడికల్ క్యాంపులు, ఫిజియోథెరపీ సేవలు, మరియు అవసరమైన సర్జరీలు నిర్వహించబడుతున్నాయన్నారు. మండలాలు వారిగా 482 మందికి నిర్ధారణ పరిక్షలు నిర్వహించి అందులో 260 మందికి ఉపకరణాలకు రిఫర్ చేయటం జరిగిందన్నారు. అలాగే విజయోతెరఫీ కొరకు 19 మండలాలలో నెలకు మండలానికి 4 చొప్పున మొత్తం 76 క్యాంపులు నిర్వహించటం జరుగుచున్నదని తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ వారి ద్వారా గ్రహణం మొర్రి మరియు గ్రహణ శూల గల వారికీ స్క్రీనింగ్ నిర్వహించి 17 మందికి ఉచిత సర్జరీలు చేయటం జరిగిందన్నారు. మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు ద్వారా నిర్ధారణ చేయబడిన 260 మంది పిల్లలకు హీయరింగ్ ఎయిడ్స్, వీల్చైర్స్, ట్రైసైకిల్స్, రోలేటర్స్, సిపి చైర్స్. టి ఎల్ ఎం కిట్స్ వంటి ఉపకరణాలు పిల్లలకు అవసరమైన మద్దతుగా అందించబడుతున్నాయన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మన కేంద్ర మంత్రివర్యులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు దైవంతో సమానమని, వారిని ఓర్పుతో చూసుకుని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి శిక్షణ ద్వారా మార్పు రావడం నా పరిశీలనలోని కొన్ని కేసులను చూసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో పుణ్య కార్యక్రమం అని, ఈ పుణ్యం జన్మజన్మల ఉంటుందన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను పలకరిస్తూ, ముద్దాడారు.
చివరిగా సమగ్ర శిక్ష అలింకో సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన సుమారు రూ.30 లక్షలు విలువ కలిగిన ఉపకరణాలను ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యాంసుందర్, డిఇఓ ఇ.నారాయణ, ఐ.ఇ కోఆర్డినేటర్ సిహెచ్ యస్ వి సుబ్రహ్మణ్యం, ఐఇఆర్పీలు, ఐ డి ఎస్ ఎస్ టీచర్లు, ఫిజియోథెరపిస్టులు, పిల్లలు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.