త్వరలో నాలుగు కోట్లతో మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ అందుబాటులోకి: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రకటన
3 కోట్లతో భీమవరం, ఆచంటలో డయాలసిస్ సెంటర్ల నిర్మాణ పనులను ప్రారంభించిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
ఆరు నెలలో నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన కేంద్రమంత్రి
ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవతో భీమవరం, ఆచంటలలో అత్యాధునిక ప్రభుత్వ డయాలసిస్ విభాగాల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. రెండుచోట్ల కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ జిల్లాలో భీమవరం విద్య, వైద్య రంగాల్లో ముందున్నప్పటికీ ప్రభుత్వ రంగంలో డయాలసిస్ సెంటర్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేక పేషెంట్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమస్య తన దృష్టికి వచ్చిందని, అందుకే అత్యవసర వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్ ఆరు నెలల్లో అందుబాటులోకి రానుందని, అత్యాధునిక డయాలసిస్ యంత్రాలతో కూడిన 10 బెడ్‌లను డయాలసిస్ రోగులకు ఉచిత చికిత్స కోసం అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రకటించారు. అవసరాన్ని బట్టి అదనపు బెడ్‌లను కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని డయాలసిస్ సేవలు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్‌లో అదనపు బెడ్ల కోసం ₹2 కోట్లు, ఆచంట డయాలసిస్ సెంటర్ కోసం ₹1 కోటి,అత్తిలిలో డయాలసిస్ మిషన్లకు ₹75 లక్షలు సి ఎస్ ఆర్ నిధులను సమకూర్చినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. త్వరలో ₹4 కోట్ల రూపాయల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
భీమవరం ఎమ్మెల్యే, పి.ఎ.సి. చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడుతూ భీమవరంలో ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు వెళ్లవలసి వస్తుందని, ప్రయాణంలో వారు పడుతున్న బాధ వర్ణనాతీతమని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి తాను కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద సెంటర్ నిర్మిద్దామని భావిస్తున్న తరుణంలో, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రెండు కోట్ల సి.ఎస్.ఆర్ నిధులతో అత్యాధునిక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ పి. సూర్యనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బి.జె.పి. జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, బి.జె.పి. జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, జనసేన పార్టీ నాయకులు చంద్రశేఖర్, బండి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆచంటలోని సిహెచ్సి ప్రైమరీ సెంటర్ వద్ద కోటి రూపాయలతో డయాలసిస్ విభాగం నిర్మాణ పనులను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఒక కోటి రూపాయల సిఎస్ఆర్ నిధులతో డయాలసిస్ విభాగం నిర్మాణంతోపాటు మూడు అత్యాధునిక డయాలసిస్ యంత్రాలతో కూడిన బెడ్లు డయాలసిస్ పేషెంట్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి తదితరులు పాల్గొన్నారు.