తుఫాన్ పునరావాస కేంద్రంను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
మంగళవారం కాళ్ల మండలం కల్వపూడి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ తుఫాన్ బాధితులుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేల చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భోజన వసతి, త్రాగునీరు, టాయిలెట్స్, శానిటేషన్, జనరేటర్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మందులను సిద్ధముగా ఉంచుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు జనరేటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. మోడీ గ్రామంలో ఉప్పుటేరు వద్ద మొగదిండు డ్రైన్ ఉధృతిని పరిశీలించారు. ఏటిగట్టు దిగువున పల్లపు ప్రాంతాల్లో నివాసలు ఉన్న గృహాలను పరిశీలించారు. మాలవాని తిప్ప గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రo పరిశీలించారు. విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు. బలమైన గాలులకు చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడే ప్రమాదం ఉన్నందున ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. రహదారులకు అడ్డంగా పడే చెట్లను తొలగించేందుకు జెసిబిలు, కట్టర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి తుఫాన్ కారణంగా ఏర్పడే ఎటువంటి విపత్తునైన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ సుందర్ సింగ్, ఎంపీడీవో స్వాతి, ఎలక్ట్రికల్ వైద్య, ఇరిగేషన్ డ్రైనేజ్ వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.