తుఫాన్ల కారణంగా నష్టపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

Publish Date : 17/11/2026
WhatsApp Image 2026-11-17 at 6.35.52 PM

కోత కోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలి

రైతులకు భరోసా కల్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

ఆర్నబ్, మురసు తుఫాన్లతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు.

మంగళవారం మొగల్తూరు గ్రామంలో సమీపంలోని పంట పొలాలను ఆమె పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన రైతు మసులు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా తుఫాన్ల కారణంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వివరించారు.

రైతులు కోత కోసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా త్వరితగతిన విక్రయించాలని సూచించారు. వర్షాల కారణంగా ధాన్యం రంగు మారినా, తేమ శాతం అధికంగా ఉన్నప్పటికీ రైతులు ఆందోళన చెందవద్దని, అటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
రాబోయే రెండు రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కోత కోసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలని, వీలైనంత త్వరగా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రైతులు వర్షాల కారణంగా మరింత నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం, తదితరులు పాల్గొన్నారు.