తుఫాను నివారణ చర్యలకు జిల్లా యంత్రాంగం సర్వత్ర సన్నద్ధం. లంక ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూమ్లను సిద్ధం చేయాలి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దృష్ట్యా అక్టోబర్ 27, 28 తేదీల్లో అత్యంత తీవ్ర తుఫాను వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
సోమవారం గూగుల్ మీట్ ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, సివిల్ సప్లై, ఫిషరీస్, సాంఘిక సంక్షేమ, ఐసిడిఎస్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో, విద్య, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితర శాఖల అధికారులతొ తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, అత్యవసర సేవలకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు తెలిపారు.
** అత్యవసర వైద్య సేవలు
లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను అవసరమైన సందర్భాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముఖ్యంగా లంక గ్రామాల్లోని వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్కడ తాగునీరు, పాలు, ఆహారం, మందులు, ప్రథమ చికిత్స కిట్లు, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిపారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
అంగన్వాడి కేంద్రాల్లోని గర్భిణీలు, చంటిబిడ్డ తల్లులకు ఎప్పటికప్పుడు పాలు, గుడ్లు ఆహారం అందే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ అధికారులను తెలిపారు. అంగన్వాడి సూపర్వైజర్లు ప్రజలకు ఇవ్వవలసిన ఆహారం, గర్భిణులను ఆసుపత్రిలో చేర్పించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
**సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాస్టల్ వార్డెన్ లు నిరంతరం అక్కడే నివాసం ఉండేలా చూడాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను తెలిపారు.
జిల్లాలో వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలోని ఎఫ్.పి షాపులకు నిత్యవసర సరుకును పంపిణీకి సిద్ధంగా ఉంచాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు ఉన్న ప్రాంతాలకు తప్పనిసరిగా అందచేయాలని తెలిపారు.
కంట్రోల్ రూమ్లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్
ఫోన్ number 08816299181 ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని మండల కేంద్రాల్లో ఇప్పటికే ఉన్న కంట్రోల్ రూమ్లను అప్రమత్తం చేయాలని తెలిపారు.
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
**భారీ వర్షాల కారణంగా కాలువలు, డ్రైనేజీలను ముందుగానే శుభ్రం చేసి
నీరు నిల్వ ఉండకుండా ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
కాలువలు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక, తూడు, తూటికాడ తదితర అడ్డంకులను తొలగించి, వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చూడాలన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మోటార్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
*భారీ వర్షాల వల్ల జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, ఇతర రహదారులు దెబ్బతిన్నా, నీటితో మునిగినా వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సంబంధిత నేషనల్ హైవేస్, రహదారుల శాఖ అధికారులకు తెలిపారు. రోడ్ల వెంట ఎక్కడైనా చెట్లు పడిపోతే వెంటనే వాటిని తొలగించే విధంగా అవసరమైన కట్టారులను ఏర్పాటు చేసుకోవాలని ఆర్ఎంబి శాఖ అధికారులకు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద అవసరమైన హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు.
భారీ వర్షాలు, తుఫాను సమయంలో తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతినే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన విద్యుత్ స్తంభాలు, మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన నీటి నిల్వలు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
**విద్య సంస్థల భవనాల్లో స్లాబులు పెచ్చులు పడే అవకాశం ఉన్న వాటిని ముందుగానే గుర్తించి ఖాళీ చేయించాలని విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అంశంపై నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు తెలిపారు.
**భారీ వర్షాల కారణంగా రైతుల పంట పొలాలు ముంపునకు గురికాకుండా, రైతులకు నష్టం కలగకుండా వ్యవసాయ అధికారులు రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై వ్యవసాయ అధికారులు సూచనలు చేయాలని తెలిపారు.
** బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు అని తెలిపారు. ఆక్వా రైతాంగానికి ముందస్తు చర్యలపై అవగాహన కలిగించాలని తెలిపారు. వరదలు సంభవించిన వేళ సహాయ చర్యల నిమిత్తం లైఫ్ జాకెట్లు, సిమ్మర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మత్స్య శాఖ అధికారులను తెలిపారు.
**పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
వీధులలో భారీ వర్షాల వలన రోడ్లు, డ్రైన్లు మునిగిపోకుండా మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు నీటిని, చెత్తను తొలగించే విధంగా పారిశుధ్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
*అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అన్నారు.
** వాతావరణ శాఖ జారీ చేసిన అధికారిక వెబ్సైట్ లో అన్ని శాఖల అధికారులు తమ ప్రణాళికలను, చేపట్టనున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు డేటాను అప్లోడ్ చేయాలని తెలిపారు.
జిల్లాలో తుఫాను, భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.