తల్లి పాలతోనే తల్లి, బిడ్డకు రక్షణ

తల్లి పాలను మించిన ఔషధం లేదు
బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలునందించాలి
తల్లిపాలు వలన కలిగే లాభాలపై అవగాహన కల్పించాలి…
… శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు
… ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు – 2025 సందర్భంగా బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పాల్గొన్నారు. జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రార్థనాగీతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తారీకు నుంచి ఏడో తారీఖు వరకు ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నామని, తల్లిపాలుకు మద్దతుని ఇచ్చే స్థిరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి తల్లిపాలు సంస్కృతిని ప్రోత్సహించవలసిన ప్రాధాన్యత ఎంతైనా ఉందన్నారు. తల్లిపాలు వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, కానీ ఆచరణలో 50% మాత్రమే పెడుతున్నారన్నారు. తల్లి పాలు బిడ్డ ప్రసవించిన గంటలోపుగానే ఇచ్చినట్లయితే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. బిడ్డ పుట్టిన గంటలో తల్లిపాలు ఇస్తే అదే దివ్య ఔషధం అని, దీనిని ప్రతి తల్లి కూడా పాటించాలన్నారు. తల్లిపాలు ఎంత శ్రేష్టమంటే బిడ్డ ఎదుగుదలకి, ఆరోగ్యంగా ఉండటానికి తల్లిపాలు ఒక్కటే ఉపయోగపడతాయనే విషయాన్ని మీరు గ్రహించి తల్లులు బిడ్డలకి పాలు ఇచ్చే సంస్కృతిని అలవాటు చేసుకోవాలన్నారు. కొంత మందికి తెలియక బిడ్డకు పాలిస్తే మన అందం పాడైపోద్దేమో అనే ఆలోచన కూడా ఉంటుందని, ఎటువంటి అపోహ అక్కర్లేదని మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బిడ్డకు పాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా తల్లి పాలు గురించి పెద్దలందరూ తల్లులకు తెలియజేయాలన్నారు. గర్భం దాల్చిననాటి నుండి డెలివరీ వరకు మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే తల్లి పాలు ఇవ్వటానికి అవకాశం పెరుగుతుందన్నారు. తల్లికి పాలు పెరగాలంటే, తల్లి కూడా పాలు తాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రతి తల్లి గర్భం దాల్చిన నాటి నుండి రెండు పూటలు స్వచ్ఛమైన గేదె, ఆవు పాలను తాగినట్లయితే ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటుందిని, చాలామంది పాలు తాగరని ఇది సరైంది కాదన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తల్లి బిడ్డకు పాలు ఇచ్చేందుకు అనువుగా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారని, బస్టాండ్ లోను, రైల్వేస్టేషన్లోనూ మదర్ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బిడ్డకు ఫోను మిగిలితే ఆ పాలు బ్యాంకుకు ఇచ్చినట్లయితే పాలు తక్కువగా వున్న తల్లులు తీసుకొని వినియోగించుకోవచ్చు అన్నారు. ఈ తల్లిపాలు కార్యక్రమాన్ని ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి తల్లి ఆలోచించాలన్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారం, ఫ్రూట్స్, పాలు తీసుకోవడంతో పాటు ఎక్ససైజ్ కూడా చేయాలని, గర్భవతులు కొన్ని ఎక్సర్సైజ్ లు చేయకూడనివి కూడా ఉంటాయని కొన్ని చేసేవి ఉంటాయని, మంచి ఆరోగ్య అలవాట్లు కారణంగా సుఖవంతమైన ప్రసవం వచ్చే అవకాశం ఉంటుందని, తల్లులు పాటించాలన్నారు.
ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తల్లిపాల ఆవశ్యకతను ప్రజలలోనికి తీసుకెళ్లాలని, ముఖ్యంగా వైద్య, ఐసిడిఎస్ శాఖలు అందరూ కూడా ఈరోజు చెప్పిన విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తే మనం చేస్తున్న వారోత్సవాల లక్ష్యాన్ని మనం సఫలీకృతం చేసిన వాళ్ళం అవుతాం అన్నారు. మనం 1992 నుంచి ఇలాంటి వారోత్సవాలు చేసుకుంటున్నామని, మన సాంప్రదాయంలో కూడా తల్లిని గౌరవించాలి అని ఉందన్నారు. తల్లిపాలకి ఉన్న ఆవశ్యకతలో మొదటి గంట గోల్డెన్ అవర్ అని, ఫస్ట్ టీకా పిల్లవాడికి ఇచ్చేది తల్లిపాలుతోనేనన్నారు. కొలెస్ట్రాన్ని చాలా మంది ఆపోహతో తీసి పడేస్తారని కానీ ఆ కొలెస్ట్రాన్ని తీసుకున్నప్పుడు పిల్లవాడి యొక్క రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా కలుగుతుందన్నారు. కానీ మన రాష్ట్రంలో కేవలం 52% మాత్రమే ఫస్ట్ అవర్ లో ఫీడింగ్ చేస్తున్నారని, 48 శాతం చేయట్లేదు కారణం ఏంటో మీ అందరికీ తెలుసు అన్నారు. సమాజంలో ఇంకా చాలా మందికి తల్లిపాల ఆవశ్యకత తెలియకపోవడం వల్ల, సిజేరియన్ చేసుకోవడం వలన తొలి గంటలో పాలు ఇవ్వడం లేదన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం చాలా ముఖ్యమని ఒక్క చుక్క కూడా వదలకుండా పిల్లలకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్, శక్తి కచ్చితంగా పెరుగుతుందన్నారు. తల్లిపాలు ప్రకృతి ఇచ్చిన వరం అని ఎవరు దయచేసి వృధా చేయవద్దన్నారు. తల్లిపాలు ఇచ్చేదానికి అనుగుణమైన వాతావరణం ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని ఆఫీసు, పని ప్రదేశం, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనుసరించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కచ్చితంగా పబ్లిక్ ప్లేసెస్ లో తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలన్నారు. ఈ సంవత్సరం థీమ్ కూడా అదేనన్నారు. తల్లిపాలు ఇస్తే డయేరియాకి, నిమోనియాకి బిడ్డ దూరంగా ఉంటారని, తీసుకోకపోతే చిన్న చిన్న విషయాలకే అనారోగ్యం కలుగుతుందన్నారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా, తల్లిపాలు విశిష్టతపై జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడు రోజులపాటు వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పసిపిల్లలకు అమృతం వంటి తల్లిపాలు వాటి విశిష్టత పై పాలిచ్చే తల్లులకు, కాబోయే తల్లులకు పూర్తిగా వివరించామన్నారు. తల్లి బిడ్డకు ఏ సమయంలో పాలు ఇవ్వాలి, ఏ భంగిమలో ఇస్తే మంచిది అని క్షేత్రస్థాయిలోకి వెళ్లి మా శాఖ సిబ్బంది ద్వారా తెలియజేయడం జరుగుచున్నదని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నవారికి, పని చేసే కార్మికులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు తో జిల్లా కలెక్టరేట్ లోను, బస్టాండ్ లోను ఫీడింగ్ రూములను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. అమృతంలా పని చేసే తల్లిపాలు కనీసం ఆరు మాసాలు వరకు బిడ్డకు అందజేయాలని అన్నారు. తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడంలో అపోహలు తొలగి పుట్టిన గంటలో పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు తల్లికి కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన చేసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. అమృతంలా పనిచేసే తల్లి పాలు బిడ్డకు ఆరు నెలలు అందిస్తే అవసరమైన పోషకాలు బిడ్డకు అందుతాయని అన్నారు. తల్లిపాలలో ముఖ్యమైన యాంటీ బాడీస్ వృద్ధి చెంది బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. తల్లి పాలకు దూరమైన పిల్లలకు నిమోనియా, డయోరియా వంటి వ్యాధులు బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. పాలు ఇచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని కోరారు.
గర్భిణీలకు, బాలింతలకు వివిధ రకాల పళ్ళను శాసనసభ్యులు, ఇంచార్జ్ కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. తల్లిపాలు అమృతం, డబ్బా పాలు వద్దు అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాలు వారోత్సవాలులో భాగంగా వాటి ఉపయోగాలు తెలిపే సమాచారం గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఐఓ డాక్టర్ దేవ సుధా లక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, రామలింగరాజు, మెంటే పార్థసారథి, సుశేషన ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ మాధవ్, మహేష్, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.