Close

తల్లిపాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనాలను ప్రతి ఒక్క తల్లి అవగాహన కలిగి, ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Publish Date : 18/12/2024

శుక్రవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆసుపత్రి నందు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దాతృత్వంతో సుశేణా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధాత్రి తల్లిపాల బ్యాంకును, బాలింతల నిర్వహణ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన భీమవరం నందు తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. రాష్ట్రంలోనే మన భీమవరంలో రెండవ తల్లిపాల బ్యాంకును ప్రారంభించడం జరిగిందని, మొదటి తల్లిపాల బ్యాంకు కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించినట్లయితే నవజాత శిశువులకు ప్రాణాపాయమైన అంటువ్యాధులనుంచి రక్షణ, 6 నెలల కాలము కేవలం తల్లిపాలు ఇవ్వడం వలన సంవత్సరంలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన నీళ్ళ విరేచనాలు మరియు శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4వ వంతు పిల్లలుకు పోషణకులోనై ఉన్నారని, దీనిలో 40% మనదేశం లోనే ఉన్నారన్నారు. సంవత్సరంలోపు పిల్లల మరణాలకు ముఖ్య కారణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 53శాతం శ్వాసకోస వ్యాధులు, 55 శాతం నీళ్ళవిరేచనాల జబ్బులకు ప్రధాన కారణం 6 నెలలోపు పిల్లలకు తల్లిపాలు చక్కగా అందక పోవడమేనన్నారు. మన దేశంలో 24.5% పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలోపు తల్లిపాలు అందించడం జరుగుతుందన్నారు. 46.4% పిల్లలకు మాత్రమే మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వబడుతోందన్నారు. తల్లిపాలు ప్రకృతి సహజం అని, పోతపాలు పౌడర్ పాలు డబ్బుతో కూడుకున్నవని వాటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. తల్లిపాలు పోషక విలువలతో కూడిన ఆహారం కావడం వలన బిడ్డ శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని, చక్కటి మానసిక ఆరోగ్యంతో మేధో సంపత్తి పెరిగి పిల్లలు చక్కగా చదువుకోవడానికి, నేర్చుకోవడానికి దోహదపడుతుందన్నారు. తల్లిపాలు ఇవ్వడం వలన ప్రసవానంతర రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్, అండాశయపు క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, ఎముకల బలహీనత మొదలగు జబ్బుల నుండి తల్లికి రక్షణ కలుగును. దీనితోపాటు కలిగే సహజ గర్భనిరోదక శక్తివలన వెనువెంటనే గర్భం దాల్చకుండా కూడా తల్లులకు రక్షణ కలుగుతుందన్నారు. తల్లిపాలద్వారా బిడ్డకు వ్యాధినిరోధక శక్తి సంక్రమించి వివిధ జబ్బుల నుండి పిల్లలకు రక్షణ కలుగుతుందన్నారు. హెచ్.ఐ.వి. సోకిన తల్లులు, హెచ్.ఐ.వి. మందులు వాడుకుంటూ పిల్లలకు కూడా హెచ్.ఐ.వి. మందులు ఇప్పిస్తూ మొదటి 6 నెలల కాలం కేవలం తల్లిపాలు ఇచ్చినట్లయితే తల్లి నుంచి బిడ్డకు హెచ్.ఐ.వి. సంక్రమణ కూడా తగ్గుతుందన్నారు. ప్రకృతి సహజమైన తల్లిపాలవలన వాతావరణ కాలుష్య సమస్యే లేదన్నారు. తల్లిపాల ప్రత్యామ్నాయాలైన పోతపాలు, పాలపౌడర్ పరిశ్రమలద్వారా పలువిధాలుగా వాతావరణ కాలుష్యం జరుగుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే అన్నారు.

నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్.సి.సి) చైర్మన్ డాక్టర్ ఎ.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తల్లిపాలను గుర్తించి మా సంస్థ సి ఎస్ ఆర్ నిధులతో తల్లిపాల బ్యాంకు ఏర్పాటుకు సహకరించడం జరిగిందన్నారు. దేశం మొత్తంలో ఇప్పటివరకు ఆరు తల్లిపాల బ్యాంకులకు సిఎస్ఆర్ నిధులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. మరిన్ని తల్లి బ్యాంకులను నెలకొల్పేందుకు సహకారం అందించనున్నట్లు తెలిపారు.

సుశేణా హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ కాశీనాధ లక్కరాజు మాట్లాడుతూ తల్లులకు సమగ్ర లాక్టేషన్ మద్దతు అందించడానికి, శిశువులకు అత్యుత్తమ పోషణను నిర్ధారించడానికై ఏర్పాటు చేయబడిందన్నారు. తల్లిపాలపై సలహా, పాలదానం, లాక్టేషన్ ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ప్రయోజనంగా ఉంటుందన్నారు.

తొలుత తల్లిపాల బ్యాంకు ప్రారంభానికి ముందు పూజ నిర్వహించి, రాత్రి బాలింతల నిర్వహణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మిషనరీ పనితీరు వివరాలను ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి తల్లిపాల సేకరణ, నిల్వ ఎక్విప్మెంట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డా పి.సూర్యనారాయణ, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.మాధవి కళ్యాణి, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ఎ.దుర్గాప్రసాద్, సుశేణా హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ కాశీనాధ లక్కరాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.