తణుకు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు.
గురువారం తణుకు మండలం, వేల్పూరు గ్రామంలోలో పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి తక్షణమే స్పందించారు. నీటిని తొలగింపుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి ఓటర్లకు, సిబ్బందికి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారి ఏర్పాట్లు చేయించారు.
జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఉదయం 7:00 గంటలకే పోలింగ్ సజావుగా ప్రారంభమైందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,52,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. దీనికోసం మొత్తం 1,244 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడమైనది అన్నారు. జిల్లాలో 20 జెడ్పిటిసి స్థానాలకు గాను 67 మంది అభ్యర్థులు, 340 ఎంపిటిసి స్థానాలకు గాను 744 మంది అభ్యర్థులు పోటీలో వున్నారన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు.
ఎన్నికల పోలింగ్ విధుల్లో మొత్తం 8,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది పి.ఓలు, ఎపి.ఓలు, ఓపి.ఓలు, జోనల్, రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారన్నారు. వీరికోసం 120 రూట్లను కేటాయించట మైనదన్నారు.
పోలింగ్ శాంతిభద్రతల పరిరక్షణ కోసం 942 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. వీరితోపాటు 19 స్ట్రైకింగ్ ఫోర్సులు, 12 రాపిడ్ స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
**ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తిన 43 పోలింగ్ స్టేషన్లను సురక్షితమైన ఇతర ప్రాంతాలకు మార్చడం జరిగిందన్నారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందన్నారు.