Close

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

Publish Date : 15/04/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థిక, రాజకీయ, సామాజికవేత్తగా అనేక కోణాలలో భారతదేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్ననాటి నుండి అంటరానితనానికి వ్యతిరేకం, దళితులను దూరం పెట్టే ఆలోచనలకు వ్యతిరేకంగా వారిని చైతన్యపరిచి దళితులకు పెద్ద ఎత్తున స్థానం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం ఎవరం ఆలోచన చేయకూడదు, వారు బుద్ధిజంను కూడా స్వీకరించడం జరిగిందన్నారు. రాజ్యాంగం రచించిన సందర్భంలో కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు, జాతులు, కులాలు, మతాలకు అందరికీ సామాజిక సమతుల్యత ఉండాలని ఆలోచనతో, దళితులను సర్వసత్తాక భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలనే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. దళితుల హక్కుల కోసమే కాకుండా, మహిళలు, కార్మికల హక్కుల కోసం పోరాడిన మహనీయులను పెద్ద ఎత్తున గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా అల్పాదాయ వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను పెద్ద ఎత్తున గౌరవించుకునేందుకు పుట్టిన, పెరిగిన, చదువుకున్న, చనిపోయిన ప్రాంతాలను అన్నింటిని కలుపుతూ ఒక హబ్ గా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. దీని కారణంగా భారత దేశ ప్రజలే కాకుండా, ప్రపంచమంతా వారు ప్రజల కోసం చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా గౌరవించదగిన గొప్ప వ్యక్తిని అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొని ఒక మహోన్నత దివ్య శక్తిగా మన మధ్యకు వచ్చి భారతీయులను కొనియాడారు. మహిళల హక్కుల కోసం కృషి చేసి, వారు విద్య ద్వారా ఎదగాలని కోరుకున్న గొప్ప వ్యక్తి అన్నారు. ఏ జాతి మహిళలు అయినా విద్య పరంగా, ఆర్థికంగా ఎదుగుతారో ఆ జాతులు ఉన్నతంగా ఎదుగుతాయని గుర్తించి అమలుపరచిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తుండిపోతారన్నారు. ఒక దివ్య శక్తిని భారతదేశమంతటా స్ఫూర్తిని నింపారని ఆయా వర్గాలు చదువుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందని, అదే స్థాయిలో చేరికలు కూడా ఉంటే లక్ష్యాన్ని సాధించినవారం అవుతాం అన్నారు. విద్య ఒకటే అన్నిటికీ మార్గం అని, రిజర్వేషన్లు కల్పించినా చదువుకోని వారు ఉండకూడదని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ లా ఉద్యమించి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ ప్రతి అడుగులోనూ మేము భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ అంబేద్కర్ స్ఫూర్తితో పయనించాలని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించాలని ధ్యేయంతో రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు వారి బాటలో పయనించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్, డివిఎంసి సభ్యులు చీకటమిల్లి మంగరాజు, పొన్నమండ బాలకృష్ణ, జిల్లెళ్ళ సత్య సుధామ, న్యాయవాది చాకూరి జయరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కొరకు పాటుపడిన గొప్ప వ్యక్తి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వివక్షతకు గురై భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఆయా వర్గాల ప్రజలందరం వారికి రుణపడి ఉన్నామన్నారు. దళితుల స్మశాన వాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అలాగే కొన్ని ప్రాంతాల్లో స్మశానవాటికలు ఆక్రమణకు గురయ్యాయని కార్యక్రమంలో ప్రస్తావించారు. అంబేద్కర్ త్యాగం మరువలేదని, వారి ఆశయ సాధనకు పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వారు కల్పించిన ఆకాశంలో భాగంగానే నేడు చాలామంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకోగలుగుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల విద్యకు పాటుపడిన గొప్ప వ్యక్తి అన్నారు. అంబేద్కర్ ను అన్ని వర్గాలకు చెందినవారుగా గుర్తించాలని, వారి ఆశయాలను నెరవేర్చినప్పుడే అదే వారికి మనం ఇచ్చే గొప్ప నివాళి అన్నారు.

చివరిగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో ఉంటూ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమొంటోలను అందజేసి, అభినందించారు.

హై స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.వి.ఎస్.బి రామాంజనేయ రాజు, జిల్లా ఎస్టి వెల్ఫేర్ అధికారి డి.పుష్ప రాణి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎ.వరప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.ముంగపతి రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్.సువర్ణరాజు, జిల్లా అధ్యక్షుడు ఇంటి సుందర్ కుమార్, రాష్ట్ర రెల్లి సంఘం ఉపాధ్యక్షులు బోచ్చ ధర్మారావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మీడియా విభాగం ఎన్.రాజేష్, మాన్యువల్ స్కావెంజర్స్ సభ్యులు సాయి దుర్గ, సంఘాల నాయకులు జి.సూర్య వరప్రసాదరావు, ఎన్.సాల్మాన్ రాజు, తెన్నేటి జగ్జీవన్, ఏఎస్ డబ్ల్యూ ఓ సిహెచ్.భానుమతి, సూపరింటెండెంట్ ఎస్.ఎన్.వి.సత్యనారాయణ, వసతి గృహ సంక్షేమ అధికారులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.