జెడ్పీటీసీ నామినేషన్ల ప్రాథమిక పరిశీలనకు ఐదు ప్రత్యేక బృందాల ఏర్పాటు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 21/10/2026
WhatsApp Image 2026-10-21 at 8.12.02 PM

జెడ్పీటీసీ నామినేషన్ల ప్రాథమిక పరిశీలనకు ఐదు ప్రత్యేక బృందాల ఏర్పాటు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీటీసీ సాధారణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల ప్రాథమిక పరిశీలనను ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జెడ్పీటీసీ సభ్యుల పదవులకు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.

నామినేషన్ల ప్రాథమిక పరిశీలన కోసం ఐదుగురు బృందాధిపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా నరసాపురం డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి బృందానికి అచంట, ఆకివీడు, అత్తిలి, భీమవరం జెడ్పీటీసీ స్థానాలను; తాడేపల్లిగూడెం డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి బృందానికి యలమంచిలి, గణపవరం, ఇరగవరం, కాళ్ల జెడ్పీటీసీ స్థానాలను కేటాయించినట్లు వివరించారు.

అలాగే జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బృందానికి మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, పాలకోడేరు జెడ్పీటీసీ స్థానాలను; జిల్లా పర్యాటక అధికారి బృందానికి పెంటపాడు, పెనుగొండ, పెనుమంట్ర, పొడూరు జెడ్పీటీసీ స్థానాలను; జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బృందానికి తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, వీరవాసరం జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల పరిశీలన బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.

ఈ ఐదు ప్రత్యేక బృందాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్‌జీఎస్‌డబ్ల్యూ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. బృంద సభ్యులంతా పర్యవేక్షణ అధికారితో సమన్వయం చేసుకుంటూ, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు రిటర్నింగ్ అధికారికి పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, ఆదేశాలను ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది ఎలాంటి ఆటంకాలు లేకుండా బాధ్యతలు నిర్వహించేలా వారిని తమ సాధారణ విధుల నుంచి తక్షణమే విధుల నుంచి విడుదల చేయాలని సంబంధిత కార్యాలయాల అధిపతులను ఆదేశించారు.